కోడా- అవినీతి కొండ క్రితం వారం ముంబై, కోలకతా, జంషెడ్ పూర్, చైబాసా, పాట్నా, రాంచి, లక్నో, ఘజియాబాద్, ఢిల్లీ నగరాలలో 70 భవనాలలో ఐటి శాఖ, ఇడి అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పెట్టుబడుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఐటి, ఇడి డిటెక్టివ్ లు జంషెడ్ పూర్, రాంచిలలో కోడా, ఆయన సహచరులకు చెందిన ఏడు భవనాలలో సోదాలు జరిపారు. చాలా వరకు పెట్టుబడులు కోడా ప్రధాన సహచరులు వినోద్ సిన్హా (చైబాసా, ఝార్ఖండ్), సంజయ్ చౌదరి (జంషెడ్ పూర్, ఝార్ఖండ్)ల పేరు మీద జరిగాయని ఇడి, ఐటి అధికారులు తెలియజేశారు.
ఒక రష్యన్ దళారీ ద్వారా లైబీరియాలో ఒక బొగ్గు గనిలో 1.7 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 8.5 కోట్లు) మేరకు కోడా పెట్టుబడి పెట్టినట్లు ఇడి ఇదివరకే ఆరోపించింది. రష్యన దళారీని రెయిన్టో అని మాత్రమే పేర్కొన్నారు. థాయిలాండ్ లోనే కాకుండా కోడా ఇండోనీషియా, సింగపూర్, దుబాయి, లైబీరియాలలో హోటళ్ళు, కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తమకు సాక్ష్యాధారాలు లభించాయని ఇడి తెలియజేసింది.
సోమవారం రాంచిలో కోడాను రహస్యంగా ప్రశ్నించిన ఐటి అధికారులు రూ. 2200 కోట్లకు పైగా విలువ చేసే 'అక్రమ లావాదేవీలకు' సంబంధించిన పత్రాలను తాము కనుగొన్నట్లు చెప్పారు. ఐటి శాఖ 70కి పైగా బ్యాంకు ఖాతాలు, లాకర్లను స్తంభింపచేసింది. సిన్హా, చౌదరిల బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేసేందుకు ఐటి శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.ఆస్తులు, పెట్టుబడుల వివరాలతో పాటు తాము రూ. 2 కోట్లు విలువ చేసే నగలను,రూ. 2.7 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. హవాలా పద్ధతిలో విదేశాలకు పంపిన మొత్తం రూ. 2500 కోట్లకు పైగా ఉండవచ్చునని వారి అంచనా. ఈ గణాంకాలను విడిగా నిర్థారించుకోవడం సాధ్యం కాలేదు. కోడా 2006 సెప్టెంబర్, 2008 ఆగస్టు మధ్య ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలావరకు ఈ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం సింగ్ భుమ్ కు చెందిన ఇండిపెండెంట్ ఎంపిగా ఉన్న మధు కోడాపైన, మాజీ మంత్రులు ముగ్గురు కమలేష్ సింగ్, భానుప్రతాప్ షాహి, బంధు టిర్కీలపైన, మరి ఐదుగురిపైన ఇడి అక్టోబర్ 9న ద్రవ్య దుర్వినియోగ నివారణ చట్టం కింద రాంచిలోని ఒక కోర్టులో కేసు నమోదు చేసింది. 'కోడాపై ఈ చట్టం కింద అభియోగం నమోదు చేసినందున, ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంది' అని ఇడి అధికారి ఒకరు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 3 November, 2009
|