పెళ్ళా? మండపాల్లేవ్! శుభముర్తాలు ఉన్న రోజుల్లోనే కదా ఎవరైనా ఫంక్షన్ హాళ్ళు కావాలనేది! నవంబర్ నెలలో మొత్తం పది రోజుల పాటు శుభలగ్నాలున్నాయి. డిసెంబర్ లో అయితే ఐదు రోజులు... 6, 11, 13, 20, 27 తేదీలు మాత్రమే శుభప్రదమైనవని పంచాంగకర్తలు చెబుతున్నారు. దీంతో కళ్యాణ మండపాలు, ఆడిటోరియాలు త్వరగా బుక్ అయ్యాయని, చాలామందికి అవకాశాలు లేక ప్రత్యామ్నాయంగా రిస్టార్ట్ లు, హోటళ్ళను కళ్యాణ వేదికలుగా చేసుకుంటున్నారని కళ్యాణ మండపం, అంలకరణ చూసే వ్యక్తి ఒకరు చెప్పారు. ఒక కళ్యాణ మండపం నిర్వాహకుడు మాట్లాడుతూ, తమ హాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు బుక్కైందని చెప్పారు. ఎవరైనా తమ మండపాన్ని ఫిబ్రవరి తర్వాత వచ్చే లగ్నాల కోసమే బుక్ చేయాల్సి ఉందన్నారు.
మండపాల బుకింగ్ లో రద్దీ పెరిగిన విధంగా వాటి ధరలు కూడా కొండెక్కాయి. 1000 మంది అతిథులకు సరిపడే మండపం లేదా ఆడిటోరియానికి రోజుకు 2.5 లక్షల రూపాయలు చెల్లించాలి. అదే 500 మంది అతిథులకు ఆతిథ్యమిచ్చే వేదిక అయితే 1.5 లక్ష రూపాయల లెక్క అప్పగించాల్సిందే! ఈ ఛార్జీలను అనేక మండపాల్లో అర్థరాత్రి నుంచి మరుసటి రోజు అర్థరాత్రి వరకు లెక్కిస్తారు.
జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్ళికోసం ఖర్చుకు వెనుకాడితే కుదరదు కనుక.. వధూవరులు, వారి పెద్దలు, మారు మాట్లాడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా మండపాల్ని 'సొంతం' చేసుకుంటున్నారు. కొన్ని మండపాలు అయితే వచ్చే ఏడాది జూన్ వరకు ఖాళీ లేవు. అంటే కళ్యాణమండపాల విలువేంటో అర్థమైంది కదా! అందుకనే కొంతమంది కన్యాదాతలు... వరుడిని వెతుక్కోవడంతో పాటు కళ్యాణ వేదికలకోసం గాలిస్తున్నారు. ఎందుకంటే అన్నీ కుదిరి 'వేదిక' లేకపోతే ఇబ్బంది తలెత్తవచ్చు. నిశ్చితార్ధంతో సరిపెట్టి పెళ్ళి తరువాత చేద్దా మంటే... ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇన్ని రోజులు ఆగితే వధూవరుల్లో ఎవరికైనా మనసు మారి సం'బంధాలు' తెగిపోవచ్చు. అందుకనే వియ్యాలవారితో మాటామంతీ కుదిరేలోగానే... కళ్యాణ 'వేదిక'ను సిద్ధం చేసి... ఎలాగోలా 'మూడు ముళ్ళు' వేయించాలని పెళ్ళి 'పెద్దలు' ఆరాటపడుతున్నారు! శుభమస్తు! కళ్యాణమస్తు!
Pages: -1- 2 News Posted: 10 November, 2009
|