కలిసొచ్చిన కరవు అయితే, ఈ ధరల పెరుగుదలకు మరొక కారణం కూడా ఉన్నది. పొరుగు రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఏపిల్ ఉత్పత్తి బాగా పడిపోయింది. 'గతంలో ఉత్పత్తిలో లోటు వల్ల మేము మరింతగా నష్టపోయేవారం. మా దగ్గర నుంచి కొరత ఉన్న సరకును హిమాచల్ ప్రదేశ్ పంపుతుండేది. కాని ఈ సంవత్సరం వారు (హిమాచల్ రైతులు) కూడా అనావృష్టి వల్ల దెబ్బ తిన్నారు' అని ఏపిల్ రైతుల సంఘానికి చెందిన గులామ్ రసూల్ భట్ చెప్పారు. దేశంలో ఏపిల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే రాష్ట్రాలలో ప్రధాన స్థానం కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలదే. కాని ఆ రెండింటిలో కూడా అగ్ర స్థానం కాశ్మీర్ లోయదే.
అమెరికన్ రకం ఏపిల్స్ పెట్టె క్రితం సంవత్సరం రూ. 300 ధరకు అమ్ముడుపోయిందని భట్ తెలియజేశారు. 'ఈ దఫా మేము వాటిని రూ. 500 ధరకు విక్రయించగలిగాం. డెలీషియస్, కేసరి, హజ్రత్ బలీ వంటి ఇతర రకాలకు కూడా గణనీయమైన ధరలే పలికాయి' అని ఆయన చెప్పారు. కాశ్మీర్ లో కొన్ని రకాలకు కిలోకు రూ. 100 ధర లభించిందని, చాలా సంవత్సరాలుగా లోయలో అంతటి ధర లభించలేదని భట్ తెలిపారు.
కాశ్మీర్ కు ప్రధాన ఆదాయ వనరులలో హస్తకళలు, టూరిజంతో తోటలు కూడా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో మూడింట ఒక వంతు మందికి పైగా అంటే 30 లక్షల మందికి ఇవే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను జీవనోపాధి కల్పిస్తున్నాయి. నిరుడు జమ్ములో ఆందోళనకారులు అమర్ నాథ్ భూముల వివాదం సమయంలో లోయలో అవరోధాలు సృష్టించినందుకు నిరసనగా ఏపిల్ రైతులు సత్యాగ్రహం నిర్వహించారు. అమర్ నాథ్ భూములపై ఆందోళన కారణంగా దేశవ్యాప్తంగా మార్కెట్లకు తమ ఉత్పత్తులను పంపలేకపోవడంతో ఏపిల్ రైతులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ లో తమ పండ్లను విక్రయించడానికి వాస్తవాధీన రేఖ (ఎల్ఒసి) దాటేందుకు ప్రయత్నించారు. కాని వారిని ఎల్ఒసి వద్ద నిలిపివేశారు.
Pages: -1- 2 News Posted: 14 November, 2009
|