2019లో అసలు ఉపద్రవం కానీ అన్నిసార్లూ పట్టించుకోకపోతే కొంపమునిగే ప్రమాదం కూడా ఉంది. 1908 సంవత్సరంలో సైబిరియా మంచు ఎడారిని ఫుట్ బాల్ సైజంత గ్రహశకలం ఢీ కొట్టింది. ఇది పది మెగాటన్నల శక్తితో భూమిని తాకడంలో రెండువేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో పెద్ద గొయ్యిపడింది. ఈ గొయ్యి ఎంతపెద్దదంటే న్యూయార్కు మహానగరాన్ని గుటుక్కున మింగేయగలిగినంత. దీనినే 'తుంగుస్క' ఎఫెక్ట్ అని శాస్త్రవేత్తలు వ్యవహరిస్తారు. ఈ గ్రహశకలం దెబ్బకు అమెరికా కాంగ్రెస్ కు బుర్ర తిరిగిపోయింది. భూమికి దగ్గరగా వచ్చే రోదసి పదార్ధాల జాడను ఎప్పటికప్పుడు కనిపెట్టాలని నాసాను ఆదేశించింది. 1998లో నాసా భూమికి చేరువగా వచ్చే పదార్ధాల ఉనికిని కనుగొనే ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. భూమికి హాని కలిగించే తోకచుక్కలు, గ్రహశకలాలు, పెద్ద సైజు రాళ్ళను గుర్తించడమే ఈ ప్రాజెక్టు పని. అలా గుర్తించిన ప్రతీ దానికి ఒక పేరును పెట్టడం నాసాకు తలకుమించిన భారంగానే మారింది.
భూమికి వినాశాన్ని తెచ్చిపెట్టే పెద్ద ప్రమాదాలు ఎదురైతే వాటి అంతు చూడటానికి కూడా అమెరికా ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. కాని అంతటి శక్తి సామర్ధ్యాలు ఉన్న సంస్థలు సిద్దంగా లేవు. పెద్దపెద్ద గ్రహశకలాలను గగనతలంలోనే అణుబాంబులతో పేల్చివేయడం అన్న ఆలోచన అంతటి సత్ఫలితాలను ఇచ్చేదిగా లేదు. ఎందుకంటే అలాంటి నిరోధక చర్యలు చేపట్టాలంటే ఆ గ్రహశకలాన్ని కనీసం ముప్ఫై సంవత్సరాల ముందే గుర్తించగలగాలి. కానీ ప్రస్తుతం కొన్ని ప్రమాదకర రోదసి శకలాలను కేవలం సంవత్సరం క్రితమే కనిపెట్టారు. మరీ చిన్నవి అయితే మూడు రోజుల ముందే వాటి ఉనికి తెలుస్తోంది.
గత ఎనిమిదేళ్లుగా రోదసిలో జరిగిన 300 విస్ఫోటనాలను వెస్ట్రన్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు పీటర్ బ్రౌన్ రికార్డు చేశారు. ఇవి టెలివిజన్ సైజు నుంచి అపార్టుమెంటు సైజు వరకూ ఉన్నాయి. అయినా భూమిపై తుంగుస్క తరహా తాకిడికి వందేళ్ళకు ఒక్కసారిగాని వెయ్యేళ్ళకు ఒక్కసారిగాని జరిగే అవకాశం మాత్రమే ఉందని ఆయన వివరిస్తున్నారు. 'అపోఫిస్' అనే పేరుపెట్టిన గ్రహశకలం 2029లో భూమిని ఢికొట్టే అవకాశం రెండున్నర శాతం ఉందని 2004సంవత్సరంలో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2005 సంవత్సరంలో మళ్ళీ లెక్కలు కట్టి ఐదువేలఐదువందల అవకాశాల్లో ఒక అవకాశం మాత్రమే ఈ అపోఫిస్ భూమిని ఢీ కొట్టేందుకు ఉందని తేల్చారు. మళ్ళీ మొన్న అక్టోబర్ 7వ తేదీన లెక్కలు వేసి రెండులక్షల50వేల చాన్సుల్లో ఒకటి మాత్రమే నని చెప్పారు.
భూమికి సమీపానికి వచ్చే రోదసి పదార్ధాలు కిలోమీటర్ల వ్యాసార్దంలో గాని అంతకంటె పెద్దవిగాని అయితేనే ప్రస్తుతం నాసా దగ్గరున్న పరికరాలు గుర్తించగలుగుతాయి. కిలోమీటరు వ్యాసార్ధం కంటే తక్కువ సైజు ఉన్నవి కూడా భూమిపై మానవాళిని నాశనం చేయగలవని, కాబట్టి ఈ నాసా పరికరాల సామర్ధ్యం పనికి రాదని జాతీయ పరిశోధన మండలి అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. వాళ్లు ఉదహారణగా తుంగుస్కనే చూపెడుతున్నారు. 30 నుంచి 40 మీటర్ల వ్యాసార్ధం ఉన్న గ్రహశకలం ఢీ కొంటేనే తుంగుస్క లాంటి ఉత్పాతం ఏర్పడిందని పేర్కొంటున్నారు. 2020 నాటికి 140 మీటర్ల వ్యాసార్ధం ఉన్న పదార్ధాలను కూడా 90శాతం కనిపెట్టగలమని నాసా చెబుతోంది. మొత్తానికి భూమిని రక్షించడానికి రోదసి నుంచి దూసుకువచ్చే ప్రమాదాలను నివారించడానికి అమెరికా కాంగ్రెస్ పెద్ద మొత్తాలనే వెచ్చించడానికి సిద్ధంగా ఉంది.
Pages: -1- 2 News Posted: 1 December, 2009
|