తరువాత ఏమిటి? తెలంగాణ ఉద్యమం తీరుతెన్నులను గమనిస్తూ, కేసిఆర్ ఆరోగ్యం గురించి తెలిసినా కేంద్రం స్పందించలేదు. కానీ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థులు మాత్రం చలించిపోయారు. దీక్ష విరమించమని కేసిఆర్ ను కోరారు. కేంద్రం స్పష్టమైన హామీతో ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనీ హెచ్చరించారు. అదలా ఉంటే పదకొండు మంది తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు ప్రధానిని, భద్రతా సలహాదారు నారాయణన్ ను కలిసి తెలంగాణ పై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కోరారు. వీరిని ప్రధాని అడిగిన ప్రశ్న ఒక్కటే ప్రజలు తెలంగాణను అంతగా కోరుకుంటుంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటెలా వేశారని. భద్రతా సలహాదారు నారాయణన్ సందేహం ఏమిటంటే చిన్న రాష్ట్రాలుగా ఏర్పడిన పక్కనే ఉన్న ఝర్ఖండ్, చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ప్రాబల్యం ఎక్కువైపోయింది. మరి తెలంగాణ స్థితి ఏమిటనేది.
ఒక్కటి మాత్రం నిజం. కేంద్ర నాయకత్వం ఏ సమస్యనైనా రాజకీయ అద్దంలోంచే చూస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ప్రత్యర్ధులతో కలిసి ఘోర పరాజయం పాలైన తెరాస బలాన్ని కేంద్రం అంచనా వేస్తూనే ఉంటుంది. అదీ కాక ఇలాంటి వత్తిడులకు తలవంచి కేసిఆర్ ను చర్చలకు పిలిచో, లేక ఏదో హామీ ఇచ్చో కేసిఆర్ ను హీరోగా ఎందుకు చేస్తుంది. అంటే తెరాస వ్యూహాత్మకంగా తప్పిదాన్ని చేసిందేనేది తెలంగాణ అనుకూల వాదుల సరికొత్త అసంతృప్తి. వైఎస్ తెలంగాణ వ్యతిరేకి అని స్పష్టంగా తెలిసి కూడా ఎప్పుడూ ఇంత బలమైన ఉద్యమానికి తలపడని కేసిఆర్ ఇప్పుడే ఎందుకు తెగించారన్నది కేంద్రం విశ్లేషిస్తుంది. రోశయ్య అంత బలమైన ముఖ్యమంత్రి కాదనే తెరాస అభిప్రాయమా, అదే అయితే తెరాస ఇంకా ఎంతకాలం ఇంత బలంతో పోరాటం సాగిస్తుందో వేచి చూద్దామన్నదే కేంద్రం అభిప్రాయం కావచ్చన్నది పరిశీలకుల అంచనా.
అంతకంటే ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన పై తెరాస పట్టుకంటే మావోయిస్టు ప్రభావిత వ్యక్తుల పట్టే ఎక్కువన్నది కేంద్రం దగ్గర ఉన్న సమాచారమని చెబుతున్నారు. ఎందుకంటే తెరాస నాయకులు ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా వారు స్వభావ రీత్యా హింసకు, విధ్వంసక చర్యలకు వ్యతిరేకులని కేంద్ర నాయకుల నమ్మకం. కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసిఆర్ ను సన్నిహితంగా గమనించి, ఆయనతో కలిసి పనిచేసిన కేంద్ర నాయకులకు ఉన్న అవగాహన ఇది.
Pages: -1- 2 News Posted: 5 December, 2009
|