భీతిగొల్పుతున్నబీటలు! తెలంగాణ ఏం కాదులే అన్న ధీమాయే లేకపోతే ఈ నాయకులు ఇప్పుడే ఎందుకు హైరానా మొదలు పెడతారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని తమ నాయకులు బహిరంగంగా ప్రకటించినప్పుడే ఈ తెలంగాణ వ్యతిరేకులు లేదా సమైక్యాంధ్ర వాదులు రాజీనామాలకు సిద్ధపడాలి కదా? తెలంగాణ ఉద్యమం హింసాత్మక ధోరణికి మళ్లుతున్నప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వీరంతా నిరసన తెలపాలి కదా? కేంద్రం ఏకపక్షంగా చేసిందని ఇప్పుడు చెబుతున్న సమైక్యాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు అనుకూలంగా మంత్రులు, ఎంపీలు, సీనియర్లు వత్తాసు పలుకుతున్నప్పుడే తమ వ్యతిరేకతను ప్రకటించాలి కదా? తీరా కేంద్రం తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నాక రాజీనామాలు చేయడం, సమైక్యాంధ్ర, లేదా జై ఆంధ్ర ఉద్యమాలకు ఉద్యుక్తులు కావడం వెనుక అంతర్యం ఏమిటి? ఇంత జరిగాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఆపడం సాధ్యమా? అది సంవత్సరం కావచ్చు. పదేళ్లు పట్టొచ్చు. తరువాత సంగతి. ప్రక్రియ అంటూ మొదలైన తరువాత దానిని చెత్తబుట్టలో ఏ ప్రభుత్వమూ వేయలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని తరతరాలుగా బతుకుతున్న తెలంగాణయేతర తెలుగువారి దుస్థితిని గురించే ఆందోళన ఉంది. దీనికి కారణం తెరాస నాయకుడు కేసిఆర్ ప్రకటనలు. ఎన్ని వివరణలు ఇచ్చినా ఆంధ్రావాలే బాగో... ఆంధ్ర విద్యాసంస్థలను మూసివేయిస్తాం. భూ కబ్జాదారులను తరిమికొడతాం, ఆంధ్ర అంటే మాకు కిట్టదు అనే ప్రకటనలే ఈ అభద్రతాభావాన్ని పెంచాయి. హైదరాబాద్ లో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి ఎలాంటి బతుకు భయంలేదు. కాని తెలంగాణయేతర తెలుగువారికి మాత్రం ప్రాణాలు గుప్పెట్లోకి వచ్చేశాయి. ప్రజాప్రతినిధులకు కూడా కేంద్రం తెలంగాణ అనుకూల ప్రకటన చేయగానే గుండెలు ఒక్కసారిగా జారిపోయాయి. నమ్మశక్యం కాలేదు. విభజన అనంతర దారుణాలు జరుగుతాయన్న అనుమానం పెనుభూతంగా భయపెడుతోంది.
Pages: -1- 2 News Posted: 10 December, 2009
|