ముఖ్యమంత్రిగా గీతారెడ్డి? ఇటు తెలంగాణా వాదులు, అటు సమైక్యవాదులను సంతృప్తిపరచే ఫార్ములాను రూపొందించే భాగంలోనే గీతారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం చురుగ్గా పరిశీలిస్తోంది. తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమించిన వర్గాలలో విద్యార్ధులు బలమైన శక్తిగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ఈ శక్తిని మావోయిస్టు వర్గాలు తమ చెప్పుచేతలలోకి తెచ్చుకున్నట్లుగా నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ పరిణామం ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలవరపరిచింది. తెలంగాణా ఉద్యమం తెరాస చేతుల్లోంచి పరోక్షంగా మావోయిస్టుల చేతుల్లోకి పోతుందన్న ఆందోళన ప్రభుత్వ, పోలీసు వర్గాలలో వ్యక్తం అవుతోంది.
తెలంగాణా ఉద్యమ పోరాటంలో కీలకమైన కొందరు విద్యార్ధి నాయకులు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో గీతారెడ్డి నియామకం ద్వారా వారిని శాంతపరచి ఉద్యమానికి దూరం చేయవచ్చునన్నది కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అలాగే తెలంగాణాకు చెందిన ఒక దళిత నాయకురాలికి అత్యున్నత పదవిని కట్టబెట్టడం ద్వారా ఆయా వర్గాల అభిమానాన్ని చూరగొనాలని పార్టీ భావిస్తోంది. అన్నింటికి మించి ఈ సంక్షోభ సమయంలో అందరినీ సముదాయించడంలో ముఖ్యమంత్రి రోశయ్య రాజకీయ చాతుర్యం పని చేయడంలోదని పార్టీ గ్రహించింది. ఇటీవల ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు, సీనియర్ నాయకులతో జరిపిన చర్చలలో సైతం రోశయ్య తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఈ వయసులో తాను ఇంతకు మించి చేయలేనని, అవసరమైతే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి వైదొలగడానికి కూడా సిద్ధమేనని సూచన ప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది.
దీంతో పార్టీ అధిష్టానం దృష్టి గీతారెడ్డిపై పడినట్లు సమాచారం. హైదరాబాద్ నగరాన్ని మినహాయించి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ముఖ్యమంత్రిగా తెలంగాణాకు చెందిన వ్యక్తి ద్వారా మాత్రమే అది సజావుగా నెరవేరగలదన్న అభిప్రాయాన్ని చాలా కొందరు సీనియర్ నాయకులు వ్యక్తం చేసిన పిమ్మట ఈ దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
Pages: -1- 2 News Posted: 10 December, 2009
|