కాంగ్రెస్ 'దూర'దృష్టి
తెలంగాణ లోని 119 సీట్లలో కాంగ్రెస్ కు 51 సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు చెందిన పది మంది శాసనసభ్యులు మద్దతు ఇస్తే కాంగ్రెస్ కు మెజారిటీ లభిస్తుంది. కెసిఆర్ తో కాంగ్రెస్ కు లోపాయికారీ అవగాహన ఒకటి ఉందని, ఆయన భవిష్యత్తులో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా చేయవచ్చునని ఆ వర్గాలు సూచించాయి.
తెలంగాణలో బలమైన పునాది ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక రాష్ట్ర హోదాను వ్యతిరేకించినందుకు మూల్యం చెల్లించుకోవలసి రావచ్చు. కుదింపునకు గురయ్యే ఆంధ్రలో టిడిపి బలం చిన్న ప్రాంతమైన రాయలసీమలోనే ఉంది. కాని రాష్ట్ర రాజకీయాలలో కోస్తా ప్రాంతాలదే ప్రాబల్యం. అక్కడ కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నది. అందువల్ల, ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలంలో కాంగ్రెస్ కు రాజకీయ ప్రయోజనాలు సిద్ధించగలవని పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. తెలంగాణలో బలం ఉన్న జగన్మోహన్ ప్రత్యేక రాష్ట్ర హోదాపై తన తండ్రికి గల వ్యతిరేకత కారణంగా అక్కడ బలం కోల్పోవచ్చునని వారి భావన.
అయితే, ఒత్తిడికి కాంగ్రెస్ లొంగిపోయిందంటూ వస్తున్న వాదనలను తోసిరాజనడానికి పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ప్రయాస పడ్డారు. కెసిఆర్ నిరశన దీక్ష అనంతరం వ్యక్తమైన ఏకాభిప్రాయానికి మాత్రమే కాంగ్రెస్ స్పందించిందని ఆయన వాదించారు. సుమారు 100 మంది ఎంఎల్ఎలు రాజీనామా చేసిన పరిస్థితి గురించి ప్రశ్నించినప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా పార్టీల మధ్య ఏకాభిప్రాయమే ప్రధానమని సింఘ్వి సమాధానం ఇచ్చారు. విదర్భ, గూర్ఖాలాండ్, బుందేల్ ఖండ్, హరిత్ ప్రదేశ్ రాష్ట్రాల కోసం వస్తున్న డిమాండ్ల గురించిన ప్రశ్నకు సింఘ్వి సమాధానం ఇస్తూ, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లన్నీ ముడిపడి లేవని చెప్పారు. అయితే, తెలంగాణ ఎలా విభిన్నమైనదో ఆయన వివరించలేకపోయారు.
ఇప్పటి వరకు ఇటువంటి డిమాండ్లు ఏవి వచ్చినా రెండవ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్ సి) ఏర్పాటు తరువాతే వాటి పరిశీలన జరుగుతుందని కాంగ్రెస్ తప్పించుకుంటూ వచ్చింది. ఇప్పుటు పార్టీ అటువంటి రక్షణను కోల్పోయింది. ఈ పరిస్థితికి కాంగ్రెస్ మాత్రమే బాధ్యురాలనే వాదనను తోసిపుచ్చడానికి సింఘ్వి ప్రయత్నించారు. 'రెండు స్థాయిలలో ఏకాభిప్రాయం సాధించకుండా ఇది చేయజాలం. ఇటు పార్లమెంట్ లోను, అటు రాష్ట్ర శాసనసభలోను ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి' అని ఆయన అన్నారు.
కాగా, అసమ్మతిని అణచివేయడానికి పార్టీ నాయకులు ఇప్పుడు కంకణం కట్టుకున్నారు. తమ నిరసన వ్యక్తం చేయడానికి గురువారం సాయంత్రం సోనియాను కలుసుకోవడానికి వెళ్ళిన 21 మంది లోక్ సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులను అధిష్ఠానం నిర్ణయానికి తలొగ్గవలసిందేనని కరాఖండిగా చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు రెండింటి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోనియా తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 11 December, 2009
|