'సెపరేట్' బిజెనెస్ 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల వాస్తవ రూపం దాల్చడం కోసం మేము మా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం' అని ఉస్మానియా సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) సభ్యుడు రామారావు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం వాగ్దానం చేసినందున ఉద్యమకారులు తగ్గి ఉన్నారని ఆయన చెప్పారు. 'అయితే, హఠాత్తుగా సమైక్య రాష్ట్రం కోసం డిమాండ్ తలెత్తినందున మేము కూడా రాష్ట్ర విభజన ఎందుకు అవసరమో వివరించేందుకు యూట్యూబ్ ను, ఇతర వెబ్ సైట్లను ఉపయోగించుకుంటున్నాం' అని రామారావు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, 'తెలంగాణ - ఇప్పటికీ న్యాయం కోరుతోంది' అనే డాక్యుమెంటరీని యూట్యూబ్ లో పొందుపరిచారు. ఇది విశేషంగా జనాదరణ పొందింది. తెలంగాణ జిల్లాలలో అభివృద్ధి లేమికి సంబంధించిన గణాంకాలు, వాస్తవాలతో ఈ డాక్యుమెంటరీ కూడుకున్నది.
ఇందుకు భిన్నంగా గాయకుడు గజల్ శ్రీనివాస్ 'ఓయీ తెలుగువాడా... పద అదే వెలుగువాడ' అనే గీతాన్ని వినిపిస్తున్నారు. తెలుగు వారంతా సమైక్యంగా నిలవాలని కోరుతూ అన్ని టివి చానెల్స్ లో దీనిని వినిపిస్తున్నారు. 'తెలుగుకు ఇటీవలే ప్రాచీన భాష హోదా లభించింది.. మనం చీలిపోతే భాష కూడా ఒక మాండలికంగా మిగిలిపోయి ఏదో ఒక రోజు అంతరిస్తుంది' అని ఆయన అంటున్నారు. తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర, కళింగాంధ్ర, గ్రేటర్ రాయలసీమ కోసం డిమాండ్లు అప్పుడే వినిపిస్తున్నాయని గజల్ శ్రీనివాస్ చెప్పారు.
చలనచిత్ర పరిశ్రమ కూడా తాజా పరిణామాలకు స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవితంపై 'మహా ప్రస్థానం' అనే చిత్రం తీసిన దర్శకుడు పి.సి. ఆదిత్య ఈ అంశంపై ఒక చిత్రాన్ని తలపెడుతున్నారు. తాను సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నప్పటికీ తెలంగాణ వెనుకబాటు తనాన్ని ఎత్తిచూపగలనని ఆయన చెప్పారు. 'నా చిత్రానికి తెలంగాణ ప్రాంతం ప్రజల సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా ఉంటాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ ఎందుకు తలెత్తిందని నా చిత్రంలో చర్చిస్తాను' అని ఆయన తెలిపారు. 'అయితే, సమైక్యంగా ఉండవలసిన ఆవశ్యకతను ఇది నొక్కి చెబుతుంది' అని ఆదిత్య తెలిపారు.
Pages: -1- 2 News Posted: 16 December, 2009
|