తిలోదకాలే మేలు : టీజీ సమైక్యాంధ్రను సమర్ధించడం కారణంగా ఒక్క ప్రజారాజ్యం పార్టీలోనే చీలికలు రాలేదని, అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలూ నిట్టనిలువుగా చీలిపోయాయని ఆయన చెప్పారు. తెలుగుదేశంపార్టీలో బీటలు వచ్చాయని, కాంగ్రెస్ లో సైతం ప్రాంతాల వారీగా బేధాభిప్రాయాలు పొడసూపాయని, భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ కూడా దీని నుంచి మినహాయింపు లేదని వెంకటేష్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు, కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష సమయంలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా స్పందించకపోవడం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణాలులేవని వివరించారు. ఒకసారి తెలంగాణ ప్రకటన కేంద్రం చేసిన తరువాత మాత్రమే ప్రజాభిప్రాయం ప్రస్ఫుటంగా కనిపించిందని, అంతవరకూ అది నిబిడీకృతంగానే ఉండిపోయిందని వెంకటేష్ విశ్లేషించారు. గత ఐదారు దశాబ్ధాలుగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ డ్రామా నడుస్తూనే ఉందనీ, ఈ సారి కూడా ప్రజలు దానిని అలానే పరిగణించారనీ ఆయన చెప్పారు. గత ఏడెనిమిదేళ్ళుగా రోజూ ఈ కథ నడుస్తూనే ఉందనీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏనాడూ దీనిని సీరియస్ గా పట్టించుకోలేదని ఆయన అన్నారు.
కానీ, మెరుపులేని పిడుగులా రాత్రికి రాత్రే తెలంగాణా అంటూ ప్రకటిస్తే ప్రజలు విస్తుపోయారనీ, ఆపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనీ అన్నారు. తెలంగాణాతో తరతరాలుగా ముడిపడిన తమ బతుకుల గతేమిటన్న ప్రశ్నకు సమాధానం సమైక్యాంధ్రలోనే ఉందనీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం, ప్రాంతాల అభివృద్ధిని జిల్లాల వారీగా లెక్కలు వేసుకోవాలనీ, ఆ తరువాత అన్యాయం జరిగినట్లు నిర్ధారణ అయితే హక్కులకోసం, అభివృద్ధి కోసం పోరాడాలని ఆయన హితవు చెప్పారు. అంతేకానీ శాస్త్రీయమైన ఎలాంటి నిర్ధారణలు లేకుండా అన్యాయం జరిగింది అంటూ రాష్ట్రాన్ని ముక్కలు చేసుకోవడం అర్థరహితమని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులం అందరూ రాజీనామాలు చేశామనీ, సమైక్యాంధ్రకోసం రాజకీయ నాయకులుగా తాము పోరాడతామని, విద్యార్థులు ఆందోళన బాట వదిలి విద్యాలయాలకు వెళ్ళి చదువుకోవాలని వెంకటేష్ కోరారు. రాజకీయ నాయకులుగా తమకు చాతకాక పోయినా లేదా సమైక్యాంధ్రను సాధించలేకపోయినా విద్యార్థులకు తాము స్పష్టంగా చెబుతామని, ఉద్యమ సారధ్యాన్ని అప్పగిస్తామని ఆయన చెప్పారు. అంతవరకూ చక్కగా విద్యార్థులు చదువుకోవాలని, తీరిక సమయాలలో కొద్ది భాగాన్ని సమైక్యాంధ్ర ఉద్యమానికి చేయూతనివ్వాలని ఆయన చెప్పారు.
Pages: -1- 2 News Posted: 17 December, 2009
|