2009- ఎన్ని విపరీతాలు? భారీ వర్షాల వల్ల, కనివిని ఎరగని స్థాయిలో సంభవించిన వరదల వల్ల జన జీవనం అస్తవ్యస్తమై మరొక సంక్షోభాన్ని సృష్టించినప్పుడు కూడా పరిస్థితులు సర్దుబాటు కాలేదు. రుతుపవనాల వైఫల్యం తరువాత అకాలంలో వర్షాలు కురిసాయి. బాధిత ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలతో అధికార యంత్రాంగం ఒక వైపు సతమతం అవుతుండగా మరొక వైపు పలు జిల్లాలలో ఆస్తినష్టం, ప్రాణనష్టం పెరిగిపోసాగాయి. ఆతరువాత నెమ్మదిగా రాష్ట్రంలో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటుండగా మరొక వైపరీత్యం సంభవించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఆందోళన విద్యార్థుల రంగ ప్రవేశంతో మరింత తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులు సారథ్యం వహిస్తుండగా రాజకీయ నాయకులు వారి వెంట నడవసాగారు. గడచిన మూడు వారాలుగా సమ్మెలు, ధర్నాలు, హింసాత్మక నిరసన ప్రదర్శనలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయసాగాయి. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ మద్దతుదారులు కూడా వీథులలోకి వచ్చారు. రాజకీయ పార్టీలు అసమ్మతి ధోరణులతో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఒక విధంగా ఇందుకు కూడా వైఎస్ఆర్ మరణం దోహదం చేసి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పట్టు తప్పుతుండడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఢిల్లీలో అధిష్ఠానం చొరవ తీసుకోవలసి వచ్చింది. పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయానికి తాను కట్టుబడి ఉండగలనని వైఎస్ఆర్ బాహాటంగా చెప్పినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, 'నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రాన్ని విభజించనివ్వను' అని ఆయన తన సన్నిహిత అనుచరులతో చెపుతుండేవారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో ఆయన రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.
2009 మరి కొన్ని రోజులలో ముగియనుండగా మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవనే ఆశించవచ్చు.
Pages: -1- 2 News Posted: 24 December, 2009
|