తెలంగాణ 'రియల్' షాక్ వాస్తవానికి ఆర్థిక మాంద్యం ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. కాని దాని వల్ల పనులు నిలచిపోలేదు. కొన్ని అమ్మకాలు జరిగాయి. త్వరలోనే పరిస్థితులు మెరుగుపడతాయని పరిశ్రమలోని వారు ఆశలు పెట్టుకున్నారు. అయితే, తెలంగాణ ఉద్యమం, తత్పర్యవసానాలు పరిశ్రమను దారుణంగా దెబ్బ తీశాయి. 'సాధ్యమైనంత త్వరలో మామూలు పరిస్థితులు నెలకొనని పక్షంలో పరిస్థితులు మరింత అధ్వాన్నం కావచ్చు. మాకు భారీగా నష్టాలు వస్తున్నాయి' అని పరిశ్రమ తెలియజేసింది.
కొనుగోలుదారుల అనాసక్తిని ప్రతిబింబిస్తూ బుకింగ్ ల రద్దు లేదా ఉపసంహరణ పెరిగిపోతున్నది. బ్యాంకు రుణాలను ఉపయోగించుకుని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆతరువాత రుణాల మొత్తాలను తిరిగి విడుదల చేయవద్దనే అభ్యర్థనలతో బ్యాంకుల వద్దకు వెళుతున్నారు.
ఈ ప్రభావానికి ఎక్కువగా గురైన ప్రాంతాలు నిజామ్ పేట, మియాపూర్. బూమ్ సమయంలో అక్కడి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. బూమ్ సమయంలో అక్కడ చిన్నవి, పెద్దవి కలిపి కొన్ని ప్రాజెక్టుల పనులను ప్రారంభించారు. కాని ఇప్పుడు బిల్డర్లు కొనుగోలుదారులను రప్పించుకోలేకపోతున్నారు. అయితే, భారీ ప్రాజెక్టులకు నెలవైన గచ్చిబౌలి, పరిసర ప్రాంతాలు మరికొంత కాలం ఈ ప్రభావాన్ని తట్టుకోగలవని భావిస్తున్నారు.
పరిశ్రమ లెక్కల ప్రకారం, ఆస్తుల ధరలు గణనీయంగా పడిపోయాయి. బూమ్ సమయంలోని ధరలతో పోలిస్తే ఈ తగ్గుదల 25 శాతం నుంచి 40 శాతం మధ్య ఉంది. శీఘ్రంగా లాభాలు ఆర్జించాలనే ఆశతో రంగంలోకి కొత్తగా ప్రవేశించిన వారిలో పలువురు ఈ పరిశ్రమ సమస్యలు ఎదుర్కొనసాగడంతో రంగంలో నుంచి నిష్క్రమించనారంభించారు. 'నగరంలోను, శివారు ప్రాంతాలలోను కార్యకలాపాలు చేపట్టిన బిల్డర్ల సంఖ్య గడచిన సంవత్సర కాలంలో 50 శాతం మేర పడిపోయిందని చెప్పవచ్చు' అని గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్ల సమాఖ్యకు చెందిన ప్రభాకరరావు పేర్కొన్నారు. 'పరిశ్రమలో అంతా అయోమయంలో పడ్డారు. కొనుగోలుదారులు వెనుకకు తగ్గడంతో బిల్డర్లకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు' అని ఆయన చెప్పారు.
Pages: -1- 2 News Posted: 28 December, 2009
|