ఎవ్వనిచే జనియించును? వాస్తవానికి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు పార్టీలు మాత్రమే ఏక సూత్ర న్యాయాన్ని పాటిస్తున్నాయి. అవి రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నాయి. కాని వాటి విధాన నిర్ణయం మాత్రం ముక్కుసూటిగానే పెట్టుకున్నాయి. అవి తెరాస, ప్రజారాజ్యం పార్టీలు. చాలా నిక్కచ్చిగా తెలంగాణ సాధన సమితికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక్కటే ధ్యేయం. రేపు రాష్ట్రం ఏర్పడితే మిగతా ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీ కి ఎలాంటి పని లేదు. రెండోది చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ. ఈ పార్టీ విధానం సమైక్యాంధ్ర. రాష్ట్ర విభజనను ఆ పార్టీ చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తోంది. మిగిలిన అన్ని పార్టీలూ ఈ విషయంలో ప్రజలను గందరగోళం పరుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో సమైక్యాంధ్ర అంటూ తెలంగాణలో జై తెలంగాణ అంటూ జనాలను వెర్రిగొర్రెలుగా చూస్తున్నాయి. ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. దీనికి బిజెపి కాస్త మినహాయింపు. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర నినాదాన్ని అందుకుని రెండు ప్రాంతాల్లోనూ సాగుతున్న ఆందోళనల్లో పాల్గంటూ రాజకీయంగా కాస్త లబ్ధి పొందడానికి తాపత్రయపడుతోంది.
ఇక సమైక్యాంధ్రయో, ప్రత్యేకాంధ్రయో దానిని పక్కన పడితే తెలంగాణ అంశంపై కేంద్ర నాయకులు రోజుకో మాట చెబుతూ తెలుగు నాయకుల్లో అనుమానాలను, అయోమయాలను పెంచిపోషిస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి, పరిపాలన మృగ్యమైపోయి, దాదాపు పదికోట్ల మంది ప్రజలు నానా అగచాట్లు పడుతుంటే ఇప్పటికీ స్పష్టత లేని ప్రకటనలతోనే కాలం వెళ్ళదీస్తున్నారు. మంచి కబురు చెబుతామని ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ మంత్రులను ఊరిస్తే, తెలంగాణ నుంచి వెనక్కి తగ్గలేదని, ప్రక్రియ మొదలవుతుందని వీరప్పమొయిలీ పాత పాటనే పాడుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండా ప్రక్రియ ప్రారంభం కాదని అహ్మద్ పటేల్ చెబుతుంటే, ఏకపక్ష నిర్ణయాలు అమలు చేసేది లేదని అంబికా సోనీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ సెగ తగిలి కాకెక్కిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో గూర్ఖాలాండ్, కూచ్ బిహార్ ప్రత్యేక వాదాలపై ప్రధానితో మాట్లాడానికి వెళ్ళి తిరిగి వచ్చి తన రాష్ట్రం గురించి మాట్లాడకుండా తెలంగాణ రాగం తాజాగా ఎత్తుకున్నారు. ఇంతవరకూ కేంద్రం చెప్పని విషయాలను ఆయన ప్రకటించేశారు. ఏకాభిప్రాయసాధన ప్రక్రియ జరిగిన తరువాతే తెలంగాణ వస్తుందంటూ మరో అయోమయానికి అంకురార్పణ చేసారు.
ప్రస్తుతానికి తెలంగాణలో అయినా, సీమాంధ్రలోనైనా సాధారణ జనాన్ని వేధిస్తున్న ప్రశ్నలు చాలా చిన్నవే. రేపు బంద్ ఉందా లేదా? బస్సులు, రైళ్ళు తిరుగుతాయా? లేదా? ఊరెళదాం అనుకంటున్నాం ఏం ఫర్వాలేదు కదా? ఆఫీసుకు సురక్షితంగా వెళ్ళగలమా? బ్యాంకులు ఉంటాయా? కూరగాయలు దొరుకుతున్నాయా? తెలంగాణ రాష్ట్రం వస్తే, సమైక్యాంధ్రానే ఉండిపోతే, ప్రత్యేకాంధ్ర ఎర్పాటైపోతే అది ఎవరి ఉద్యమం వలన వచ్చిందో, ఆ ఘనత ఎవరికి దక్కుతుందో ఎంత తొందరగా తేలితే అంత తొందరగా ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
Pages: -1- 2 News Posted: 28 December, 2009
|