'నరసింహన్' కలవరం గవర్నర్ శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించడం విడ్డూరమని, డిజిపి, ఇంటలిజెన్స్ అధిపతితో ఆయన మంతనాలు చేయడం పరిధి దాటడమేననని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ విమర్శలు సంధించారు. ఇదిలాగే కొనసాగితే తెలంగాణపై పరిస్థితి చేయి దాటిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టప్రతి పాలన తీసుకొచ్చి తెలంగాణ వాదాన్ని తెరమరుగు చేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, సిపిఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే గవర్నర్ వ్యవహార శైలి వీటన్నింటినీ పట్టించుకోవద్దన్న చందంగానే సాగుతోంది. ఈ నాయకులకు అర్ధం అయింది ఒకటే కేంద్రం పంపిన నరసింహన్ ఎంతమాత్రం రబ్బర్ స్టాంప్ కాదని. ఉత్సవ విగ్రహంగా ఉండబోవడం లేదని. గవర్నర్‌గా వచ్చింది ఆషామాషీ వృద్ధ రాజకీయవేత్తనో, రాజకీయ నిరుద్యోగో కాదు. కఠిన నిర్ణ యాలు తీసుకుని, శరవేగంగా స్పందించే మాజీ పోలీసు అధికారి. మొన్నటి వరకూ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసిన అనుభవం ఉన్న క్రియాశీల గవర్నర్. అందుకే ఇంతటి కలవరం. కలకలం. ఆయనను తక్షణం మార్చాలన్న శరపరంపరమైన డిమాండ్లు అప్పుడే తెరపైకి వస్తున్నాయి.
ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్.. ఆయన తాత్కాలిక గవర్నర్‌గా ప్రమాణం చేసి ఇంకా 48 గంటలు కూడా కాలేదు. కానీ అప్పుడే అందరికీ కలవరం కలిగిస్తున్నారు. తాత్కాలిక గవర్నర్‌గా వస్తేనే ఇంత ఆందోళన కనిపిస్తుంటే, ఇక పూర్తి బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి మరెంత కలకలం సృష్టింస్తుందోనన్న వాస్తవం తాజా పరిస్థితిని స్పష్టం చేస్తోంది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న చత్తీస్‌గఢ్‌కు పూర్తిస్థాయి గవర్న ర్‌గా కొనసాగుతున్న నరసింహన్, తనదైన శైలిలో శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించడంతో వణుకు ప్రారంభమయింది. ‘రాజకీయ పరమైన నిర్ణయాలు వచ్చే వరకూ ఎదురుచూడవద్దు. ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి రావాలి.ముందు మీరు భధ్రతపై ప్రజల్లో నమ్మకం కల్పించండి’ అని నరసింహన్ తన తొలి భేటీలో పోలీసు అధికారులకు స్పష్టంగా చెప్పారన్నది ఈ వేర్పాటు వాదనాయకులకు వెన్నులో చలిపుట్టిస్తోంది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు యధాతథ స్థితికి తెచ్చేందుకు కావలసిన స్వేచ్ఛ ఇచ్చిందన్న అనుమానం ఉద్యమ సంస్థల్లో బలంగా నాటుకుపోయింది. ఐపిఎస్ అధికారి కావడంతో ఉద్యమాలను అణచివేసే స్వభావం సహజంగా ఉంటుందని, దానికి రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న అధికారాలు అదనపు బలంగా మారే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన అంటూ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అంతవరకూ వేచిచూసే అవసరం లేకుండానే నరసింహన్ తన పనితీరు, నిర్ణయాల ద్వారా అందరికీ అర్ధమయ్యేలా చేస్తారన్న అంచనాలు ఉన్నాయి.
Pages: -1- 2 News Posted: 30 December, 2009
|