యమ'హాహాకార'నగరి అయితే, వారి ఫిర్యాదులు అక్కడితో ఆగిపోలేదు. తమ ప్రాంతం అనేక సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని, అక్కడ విద్యా సౌకర్యాలు గాని, వైద్య సౌకర్యాలు గాని లేవని వారు చెబుతున్నారు. 'ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఆ ప్రాంతం పెరిగిపోతున్నది. ప్రభుత్వ పాఠశాలలేవీ లేనందున అనేక మంది పిల్లలు స్కూలు చదువు కోసం ఖైరతాబాద్ వరకు వెళ్లవలసి వస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రి గాని, బస్సు సర్వీసులు గాని లేవు' అని రోజు కూలీ సి. శాంత చెప్పింది.
మోమిన్ హుస్సేన్ అనే 38 ఏళ్ల మిర్చిబజ్జీ వ్యాపారి తన కుటుంబం కోసం ఒక పక్కా ఇంటిని నిర్మించుకోగలిగానని ఒక వైపు చెప్పుకున్నా మరొక వైపు ఈ పదేళ్ల కాలంలో తన జీవితంలో వచ్చిన మార్పు ఇది ఒక్కటేనని పేర్కొన్నాడు. మరే మార్పూ రాలేదని, ఇందుకు ప్రభుత్వాన్నే తప్పు పట్టాలని అతను అన్నాడు. 'ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమూ లభించడం లేదు. మాకు ఎప్పటికప్పుడు రేషన్లు లభించవు. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు మాత్రమే వచ్చి, ఏవో వాగ్దానాలు చేసి మాయమవుతుంటారు' అని హుస్సేన్ చెప్పాడు.
అయితే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆ ప్రాంతంలో స్థిరపడిన ఎం.జి. మహంతి వంటి వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహంతి ఒక దశాబ్దం క్రితం ఒరిస్సా నుంచి నగరానికి వచ్చాడు. అప్పటి నుంచి తన జీవితం మెరుగుపడిందని అతను తెలియజేశాడు. మహంతి ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పని చేస్తుంటాడు. తన స్వరాష్ట్రంలో ఇటువంటి అవకాశాన్ని తాను కనీసం ఊహించను కూడా ఊహించలేనని అతను చెబుతున్నాడు. 'మా రాష్ట్రంలో నేను ఈ మొత్తం ఆర్జించి ఉండేవాడిని కాను. ఈ మురికివాడ సంగతి ఏమో గాని నా జీవితాన్ని మాత్రం హైదరాబాద్ మెరుగుపరిచింది' అని మహంతి పేర్కొన్నాడు.
Pages: -1- 2 News Posted: 31 December, 2009
|