తెలంగాణలో మావో పాగా? తెలంగాణ ఉద్యమంలో తీవ్రవాద ధోరణులు ప్రబలడానికి గల కారణాలను మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టే పోలీసు అధికారులు గుర్తించారు. మెదక్ జిల్లాలో తెలంగాణ అనుకూల వాదులు కరెంటు బిల్లులు కట్టబోమని ప్రకటించడం వెనుక మావోయిస్టుల ప్రభావం ఉందని వారు చెబుతున్నారు. ఇలాంటి ఎత్తుగడలను గత పదేళ్లుగా మావోయిస్టులు అనుసరిస్తున్నారన్నది వారి వాదన. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని మావోయిస్టులు ప్రజలపై స్వారీ చేస్తున్నారని తద్వారా తమ స్థావరాలను పటిష్టం చేసుకుంటున్నారని, ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని మావోయిస్టులు హైజాక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పోలీసు వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని అచ్చు లాల్ గఢ్ ఉద్యమంలానే మావోయిస్టులు నడుపుతున్నారని వారు వివరిస్తున్నారు.
లాల్ గఢ్ ఉద్యమం అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చిందని, దానిలో మావోయిస్టు పార్టీ కేవలం 'ఉత్ప్రేరకం'గా పనిచేసిందని మావోయిస్టు పార్టీ అధిపతి గణపతి అప్పట్లో ప్రకటించారు. సరిగ్గా అలానే తెలంగాణ ఉద్యమంలో కూడా 'ఉత్ప్రేరకం' పాత్రను పోషించడానికి మావోయిస్టులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమ సానుభూతిపరులను, ఇతర ప్రజాసంఘాల నాయకులను తెలంగాణ ఉద్యమంలోకి పంపుతున్నారని, పోలీసు బలగాల పాత్ర పెరిగే కొద్ది దానికి ప్రతిఘటనగా ప్రజల్లో తీవ్రవాదపోకడలు పెంచడానికి వీరిని ఉపయోగిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. పోలీసులు ఈ పరిస్థితిని సక్రమంగా నియంత్రించకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయని చెబుతున్నారు. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల లాఠీ చార్జి లాంటి సంఘటనల కోసం మావోయిస్టులు కాచుకుని ఉన్నారని, అలాంటి సంఘటనలను ఉపయోగించుకునే మావోయిస్టులు బలపడతారని వివరిస్తున్నారు. ఆందోళనకారులతో వ్యవహరించేటప్పుడు అతి సంయమనం పాటించడానికి అదే కారణమని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.
హైదరాబాద్ లో జనవరి మూడో తేదీన విద్యార్ధులు చేపట్టే భారీ ప్రదర్శన ఇప్పుడు పోలీసు బాసులకు కలవరం కలిగిస్తోంది. రాష్ట్ర రాజధానికి విద్యార్ధులు రాకుండా నిరోధించాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు వెళ్ళాయి. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్ధులకు మధ్య ముఖాముఖీ ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, అందుకే వీలైనంత తక్కువ బలగాలతో పరిస్థితిని అదుపు చేయడానకి ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 31 December, 2009
|