రెండుసార్లు పుట్టిన మమత! ఆమె తండ్రే ఆమెకు రెండవ జన్మ తేదీని పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీకి ఆమెను అర్హురాలిని చేయడానికై ఆయన ఆమె వయస్సును తొమ్మిది నెలలు పెంచారు. ఈ తేడాను సరిచేయడానికి మమత ఆతరువాత ఎన్నడూ ప్రయత్నించలేదు. దానితో ఆమెకు రెండు జన్మ తేదీలు కొనసాగుతున్నాయి.
'ఇవాళ ఆమె జన్మ తేదీ అని నేను లోక్ సభ వెబ్ సైట్ లో చూశాను. స్వాతంత్ర్య యోధురాలైన మా అమ్మగారు ఆమెను కలుసుకోవాలని అనుకున్నారు. అందువల్ల మేము శిరిడీ నుంచి ప్రత్యేకంగా వచ్చాం. కాని ఇవాళ ఆమె పుట్టిన రోజు కాదని, ఆమె ఎవరినీ కలుసుకోరని ఇప్పుడు మాతో చెబుతున్నారు' అని తన 81ఏళ్ల తల్లిని వెంట తీసుకువచ్చిన మమత అభిమాని ఒకరు వాపోయాడు. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల నుంచి హరీష్ చటర్జీ రోడ్డు భవనం వెలుపల జనం చేరసాగారు. వారిలో సుందర్బన్స్ జిల్లా బసంతి నుంచి వచ్చిన ఒక రిటైరైన అర్చకుడు, బెల్ఘోరియా మహిళల బృందం, గోరఖ్ పూర్ నుంచి వచ్చిన ఒక మహిళ కూడా ఉన్నారు. తాము పొరపాటున వచ్చామనే భావనతో మధ్యాహ్నానికల్లా వారంతా అక్కడి నుంచి నిష్క్రమించారు.
అయితే, మమత జన్మ తేదీ జనవరి 5 కాదని, అక్టోబర్ 5 అని తెలుసుకున్న ఒక వ్యక్తి మాత్రం ఎంతో సంతోషించారు. ఆ వ్యక్తి బెంగాలీ నటి, తృణమూల్ ఎంపి శతాబ్ది రాయ్. 'అంటే, మా ఇద్దరి పుట్టిన రోజూ ఒకటేనన్నమాట! ఈ సంగతి తెలిసి నేను అమితంగా ఆనందిస్తున్నాను' అని శతాబ్ది రాయ్ చెప్పారు. 'ఇవాళ దీదీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు అందజేయవలసిందని కోరుతూ చాలా మంది నుంచి నాకు ఎస్ఎంఎస్ లు వస్తున్నాయి' అని శతాబ్ది తెలిపారు. మరి పుట్టిన రోజు ఒకటే అయినప్పుడు శతాబ్దికి ఆమె లక్షణాలలో వేటితో సామ్యం ఉన్నది? 'మేమిద్దరం ఎంతగానో భావోద్వేగానికి గురవుతుంటాం. మేము ఆవేశంతో పని చేస్తుంటాం' అని శతాబ్ది చెప్పారు. కాగా, ఒక జన్మ తేదీ ప్రకారం మమత రాశి తుల. ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ విన్ స్లెట్ దీ ఇదే జన్మ తేది. మరొక జన్మ తేదీ ప్రకారం మమత రాశి మకరం. దీపికా పడుకోణ్, డయానె కీటన్ లతో మమత దీనిని పంచుకుంటున్నారు.
Pages: -1- 2 News Posted: 6 January, 2010
|