చిదంబరంపై వత్తిడి కెసిఆర్ బుధవారం మధ్యాహ్నం చిదంబరంతో సమావేశమయ్యారు. తాను ఈ సమావేశం పట్ల సంతృప్తి చెందినట్లు కెసిఆర్ ఆతరువాత మీడియాతో చెప్పినప్పటికీ కేంద్రం వ్యవహరిస్తున్నతీరుకు ఆయన అసంతుష్టితో ఉన్నట్లు టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఒక వ్యవధితో ఈ ప్రక్రియ మొదలైనందున ఉద్యమాన్ని విరమించవలసిందిగా కెసిఆర్ ను చిదంబరం ఈ సమావేశంలో కోరారు. కాని ఈ విషయమై విస్పష్టమైన వాగ్దానం రానందున ఉద్యమం నిలిపివేత సాధ్యం కాదని కెసిఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. 'అలా అయితే, ఉద్యమం కనీసం ప్రశాంతంగా అయినా సాగేట్లు చూడవలసింది' అని కెసిఆర్ ను మంత్రి కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇది ఇలా ఉండగా, ఈ విషయమై కేంద్రం దృక్పథం పట్ల రెండు ప్రాంతాల కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి) నాయకులు అసంతృప్తిని వెలిబుచ్చడం యుపిఎ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడవేయవచ్చు. 'చర్చలకు గాని, కొత్త రాష్ట్రం సృష్టికి గాని స్పష్టమైన వ్యవధిని సూచించలేదు. అందువల్ల ప్రజలకు ఉద్యమాన్ని కొనసాగించడం వినా మార్గాంతరం ఉండదు' అని తెలంగాణ ఎంపి కె. కేశవరావు మీడియాతో అన్నారు. ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపిలు కూడా చిదంబరాన్ని కలుసుకున్నారు. తెలంగాణ నాయకులు ఉద్యమాన్ని విరమించినట్లయితే తాము కూడా విరమిస్తామని తాను ఆయనతో చెప్పినట్లు కావూరి సాంబశివరావు తెలియజేశారు.
ఇక ఈ రెండు ప్రాంతాల టిడిపి నాయకులలో అసంతృప్తి మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణపై కమిటీ ఏర్పాటు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చిదంబరంతో సమావేశంలో ఆంధ్ర ప్రాంత టిడిపి నాయకులు చెప్పారు. తెలంగాణ ప్రాంత టిడిపి నాయకులు కూడా కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. అయితే, 'ఈ అంశంపై ఈ ప్రాంత రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నందున ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను కేంద్రం వెంటనే ప్రారంభించాలి' అని టిడిపి తెలంగాణ ఎంఎల్ఎ డాక్టర్ నాగం జనార్దనరెడ్డి కోరారు.
కాంగ్రెస్ పార్టీని మరింతగా చిక్కుల్లోకి నెట్టుతూ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విడిగా చిదంబరాన్ని కలుసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కుప్పకూలిందని చెప్పారు. ప్రశాంత పరిస్థితుల పునరుద్ధరణ జరగని పక్షంలో చలనచిత్ర పరిశ్రమ చెన్నైకి తరలిపోగలదని చిరంజీవి హెచ్చరించారు.
Pages: -1- 2 News Posted: 7 January, 2010
|