తెలంగాణ వలలు! ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాలతో పాటు అద్దాల భవనాలను కూడా నిరసనకారులు లక్ష్యం చేసుకున్నారు. అమీర్ పేటలో చర్మాస్, పంజాగుట్టలో హైదరాబాద్ సెంట్రల్, బంజారా హిల్స్ లో రిలయన్స్ డిజిటల్ షోరూమ్, తార్నాకలో పలు వాణిజ్య సముదాయాలపై ఆందోళనకారులు రాళ్ళు మొదలైనవి విసిరి భారీగా నష్టం కలిగించారు.
కొత్తగా ముప్పు ఎదురవుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందంటూ వాణిజ్య సంస్థలకు పోలీసులు సలహాపూర్వక నోటీసులు పంపారు. 'భవనం అద్దాలకు రక్షణగా వలలు అమర్చుకోవాలని, భద్రతా సిబ్బందిని పెంచుకోవాలని, సిసిటివిలను ఏర్పాటు చేసుకోవాలని సంస్థలు, భవనాల యజమానులను ఈ నోటీసులలో కోరారు. మేము ఇప్పటికే సిసిటివిలు ఏర్పాటు చేసుకున్నందున రక్షణ వల కొనుగోలు చేసి అమర్చుకున్నాం. ఇందుకు మాకు ఎన్నో లక్షలు ఖర్చయ్యాయి' అని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని ఒక మాల్ మేనేజర్ తెలియజేశారు.
పెక్కు వాణిజ్య సంస్థలు ఈ సలహా నోటీసులను పట్టించుకుని రక్షణ వలలు అమర్చుకోవడం ప్రారంభించాయి. ఇంత వరకు బేగంపేటలో ఎయిర్ సెల్ ఆఫీసు, సిటీ సెంటర్, రసూల్ పురా సమీపంలోని గౌరీ ప్లాజా, జూబిలీ హిల్స్ రోడ్ నంబర్ 36లోని లివిస్ స్టోర్, బొవెన్ పల్లిలోని మోడి హ్యుందై షోరూమ్, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లోని నిస్సాన్ షోరూమ్ ఇలా రక్షణ వలలు అమర్చుకున్నాయి. పై నుంచి కింద వరకు అద్దాలు ఉన్న, ఐమాక్స్ తో సహా పలు భవనాలకు ఇదేవిధంగా వలలు అమర్చుకోగలరని సెంట్రల్ జోన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి) పి. హరికుమార్ సూచించారు.తాము దాదాపు 30 వాణిజ్య సంస్థలకు నోటీసులు పంపామని, కొన్ని సానుకూలంగా స్పందించాయని పంజాగుట్ట ఎసిపి జె. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. నైలాన్ తో తయారు చేసిన రక్షణ వలకు చదరపు అడుగుకు దాదాపు రూ. 20 వరకు ఖర్చు అవుతుంది. 'తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ముందు మాకు అంతగా వ్యాపారం ఉండేది కాదు. కాని ఇప్పుడు నాకు చేతిలో దాదాపు 50 ఆర్డర్లు ఉన్నాయి' అని రక్షణ వలలు సరఫరా చేసే పిఎస్ డి సర్వీసెస్ సంస్థకు చెందిన ప్రభు సుకుమార్ దాస్ తెలియజేశారు. భవనాలు, సంస్థల యజమానులు, పోలీసులు ప్రతి బంద్ పిలుపునకు భయపడిపోతుండడంతో వలల సప్లయిర్లు, ఉత్పత్తిదారులు దండిగా లాభాలు ఆర్జిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 26 January, 2010
|