2వ రిపబ్లిక్ లో తెలంగాణ? ప్రజలకు కాకపోయినా కాంగ్రెస్ పార్టీకి రెండవ రిపబ్లిక్ కోసం ప్రయత్నించడం రాజకీయంగా విజ్ఞత అనిపించుకుంటుంది. రెండవ రిపబ్లిక్ అంటే, దేశంలో మరిన్ని రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రం, రాష్ట్రాల మధ్య తిరిగి అధికారాల పంపిణీ జరుగుతుంది. స్థానిక స్థాయిలో కూడా అధికారాల పంపిణీ జరుగుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొని 58 సంవత్సరాలు పూర్తవుతున్న దశలో దేశంలో కాంగ్రెస్ ఏకైక జాతీయ పార్టీగా మిగిలిపోవడం ఇందుకు కారణం. (ఇది ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం కాకుండా వాస్తవికంగా కనిపిస్తున్నది ఇదే). 1951లో అప్పటి కొత్త రాజ్యాంగం ప్రకారం, ఎన్నికలు నిర్వహించినప్పుడు దేశంలో ఉన్న ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. 1960 చివరి నుంచి ప్రతిపక్షాల సంఖ్య పెరిగిపోయింది. అయితే, 2009 ఎన్నికలు ముగిసేసరికి (ప్రభావం చూపే విషయంలో కాంగ్రెస్ దరిదాపులలోకి వచ్చిన పార్టీ) భారతీయ జనతా పార్టీ (బిజెపి) స్థాయి కుదించుకుపోవడంతో ఆ వృద్ధ పార్టీ కాంగ్రెస్ తిరిగి దేశంలో ఏకైక జాతీయ పార్టీగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నది.
కాంగ్రెస్ పార్టీతో పాటు, తెలుగు దేశం పార్టీ (టిడిపి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి), డిఎంకె, ఎఐఎడిఎంకె, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు రాజకీయ రంగంలో రాణిస్తున్నాయి. అయితే, ఆ పార్టీల పలుకుబడి ఏదో ఒక రాష్ట్రానికే పరిమితమైంది. చివరకు జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న సిపిఎం కూడా రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. ఇక జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు సంఘటితమై, ఒకే గ్రూపుగా రూపుదిద్దుకుంటే కాంగ్రెస్ పార్టీకి పెను సవాల్ ఎదురుకావచ్చు. కాని పూర్వానుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇందుకు అవకాశాలు మృగ్యమే. ఈ పరిస్థితిలో రిపబ్లిక్ వ్యవస్థలో మార్పులతో కాంగ్రెస్ దాదాపు శాశ్వతంగా కేంద్రంలో ఆధిపత్యం సాగించవచ్చు.
జిల్లా స్థాయిలో మూడవ అంచె ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారాన్ని బదలాయించడమే అని అర్థం. దీని వల్ల ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ నేతలకు అధికారం లభిస్తుంది. ఇది జిల్లా స్థాయిలలో పలు ఉప ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి దారి తీయగలదు. అంతే కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం కలిగిస్తూ జాతీయ ప్రభుత్వాన్ని దృఢతరం చేయగలదు కూడా. దీర్ఘ కాలంలో ఇది అమెరికా తరహా ప్రభుత్వానికి దారి తీయవచ్చు. అంటే దేశాధినేతను (అధ్యక్షుడు కావచ్చు లేదా ప్రధాని కావచ్చు) నేరుగా ఎన్నుకుంటారు. అయితే, మూడవ రిపబ్లిక్ ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుంది.
Pages: -1- 2 News Posted: 27 January, 2010
|