రోశయ్యకు అగ్ని పరీక్ష అధిష్ఠానం జోక్యం చేసుకుని, తమ రాజీనామాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంఎల్ఎలను ఆదేశించిన తరువాత కూడా వారు అలా చేయలేదని, రాజీనామా లేఖలను తిరస్కరించడం ద్వారా స్పీకర్ కు తనకు సాయం చేశారని రోశయ్య ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. మంత్రులు, శాసనసభ్యులు తనకు సహకరించినట్లయితే రాష్ట్రంలో పాలనా యంత్రాంగాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలనని, అభివృద్ధి పనులు కొనసాగించగలనని రోశయ్య చెప్పారు. అయితే, ఇప్పుడు మంత్రులు, శాసనసభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరిస్తుండడంతో అంతా అస్తవ్యస్తంగా తయారైందని, కొందరైతే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగకరమైన రీతిలో కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన అంశంపై పార్టీ ఎంఎల్ఎలలో నెలకొన్న క్రమశిక్షణా రాహిత్యం గురించి రోశయ్య పార్టీ అధిష్ఠాన వర్గానికి ఫిర్యాదు చేశారు. తొమ్మిది మంది సభ్యులతో సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షురాలు నియమించడాన్ని కూడా విమర్శిస్తున్నారని, తన వ్యవహార సరళిపై కొందరు శాసనసభ్యులు బాహాటంగా ప్రకటనలు విడుదల చేస్తున్నారని అధిష్ఠాన వర్గంతో ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది. వారితో తాను వాదనకు దిగజాలనని, వారిని దారిలో పెట్టేందుకు అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని, ఇది జరిగినట్లయితే, తాను మెరుగైన పాలనను అందించగలనని సోనియా గాంధి రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ తో రోశయ్య చెప్పినట్లు తెలుస్తున్నది. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ పరిశీలనాంశాలు వెల్లడైన తరువాత పరిస్థితి ఏవిధంగానైనా మారిపోవచ్చునని కూడా రోశయ్య హెచ్చరించారు.
Pages: -1- 2 News Posted: 8 February, 2010
|