భాగ్యనగరి భద్రమేనా? కాగా, పుణె పేలుళ్ల తరువాత నగర పోలీసులు పాపులర్ ఫలహార శాలలు, జనసమ్మర్దం అధికంగా ఉండే ఇతర ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్ల గురించి ఆందోళన చెందుతున్నారు. రోజూ సగటున దాదాపు లక్ష మంది ప్రయాణికులు నగరంలోని ఎంజిబిఎస్, జూబిలీ బస్ స్టేషన్ నుంచి ప్రయాణిస్తుంటారు. అయితే, ఈ రెండు చోట్ల భద్రతా ఏర్పాట్లు నామమాత్రమే. బ్యాగేజీని గాని, ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదు. 'ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, పోలీసులు మామూలుగా రౌండ్లు వేస్తుంటారు. అయినప్పటికీ లగేజి దొంగతనాల గురించి రోజూ ఫిర్యాదులు వస్తుంటాయి. వారు జేబు దొంగతనాలనే అరికట్టలేకపోతుంటే ఉగ్రవాదులను ఎలా నిరోధించగలరు' అని ఎంజిబిఎస్ లో ఒక పుస్తకాల దుకాణం యజమాని కె. రమణయ్య అన్నారు.
నగరంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో డోర్-ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (డిఎఫ్ఎండిలు), క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సిసిటివి) కెమెరాలు ఉన్నాయి. అయితే, బ్యాగేజీని తనిఖీ చేయని భద్రతా సిబ్బంది అలసత్వం, అనధికారిక ప్రవేశ కేంద్రాల వల్ల ఈ విధ్వంస నిరోధక చర్యలు నిరర్థకం అవుతున్నాయి. ముంబై, పుణెలలో ఇటీవల ఉగ్రవాదుల దాడులలో విదేశీయులను లక్ష్యంగా చేసుకున్నారు. హైదరాబాద్ కు వచ్చే విదేశీయులలో అధిక సంఖ్యాకులు స్టార్ హోటళ్లలో బస చేస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఆ హోటళ్లలో భద్రత వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని పోలీసులు కనుగొన్నారు. టాస్క్ ఫోర్స్ రహస్య సిబ్బంది ఆయుధాలతోనే కొన్ని స్టార్ హోటళ్లలోకి వెళ్లగలిగారు.
ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్, ఆర్టీసి క్రాస్ రోడ్స్ సమీపంలోని బావర్చి, మదీనా సమీపంలోని షాదాబ్ వంటి పాపులర్ ఫలహార శాలలను రోజూ వేలాది మంది సందర్శిస్తుంటారు. కాని అక్కడ భద్రత అనేది మచ్చుకు కూడా కనిపించదు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎ.కె. ఖాన్ మాట్లాడుతూ, 'నగరంలో ఫలహార శాలలతో సహా జనసమ్మర్దం అధికంగా ఉండే పలు ప్రదేశాలలో భద్రత పరంగా లోపాలు ఉన్న సంగతి మాకు తెలుసు. వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్ల యజమానులను భద్రతపై చైతన్యపరచడం కోసం మేము కార్యగోష్ఠులు నిర్వహించాం. మేము అతిత్వరలో అటువంటి కార్యక్రమం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసుకోవలసిందిగా వారికి సలహా ఇస్తాం' అని చెప్పారు.
Pages: -1- 2 News Posted: 17 February, 2010
|