'గ్రేటర్' తప్పు ఫ్లైట్లకు ముప్పు సెల్ టవర్లదీ అదే కథ
సెల్ ఫోన్ టవర్లదీ అదే కథ. ఎలాంటి అనుమతులూ లేకుండానే వేలాది టవర్లను నిర్మించేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిదిలో ఏ నిర్మాణానికైనా ఆ సంస్థ ఆమోదముద్ర అవసరం. కాని, విచిత్రంగా నగరం అంతటా ఎత్తైన భవనాలపై సెల్ టవర్ల ఏర్పాటును కార్పొరేషన్ నియంత్రించలేకపోయింది. సెల్ టవర్ ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని జిహెచ్ఎంసి ఇటీవలి కాలంలో నొక్కి చెబుతున్నా, పాతవి మాత్రం ఇప్పటికీ ఆ పరిసరాలలో నివసిస్తున్నవారికి ప్రమాదాలను తెచ్చిపెడుతూనే ఉన్నాయి. కాగా, సెల్ టవర్లు భవనాల యజమానులకు పాడియావుల మాదిరిగా లాభాలు చేకూరుస్తున్నాయి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు నెల అద్దెగా రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు చెల్లిస్తుంటారు.
నగరంలో వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు చెందినవి నాలుగు వేలకు పైగా సెల్ టవర్లు ఉండగా, జిహెచ్ఎంసి అధికారిక రికార్డులో ఉన్న టవర్ల సంఖ్య 1600 మాత్రమే. అధిక సంఖ్యాక టవర్లు, అవి ఉన్న భవనాల కట్టడం సామర్థ్యం కావలసిన ప్రమాణాలకు అనుగుణంగా లేదు. హైకోర్టు ఏర్పాటు చేసిన ఒక కమిటీ పరిశీలన జరిపి 250 పైచిలుకు టవర్ల కట్టడం సామర్థ్యం బలహీనంగా ఉన్నట్లు తేల్చింది.
ఈ విషయమై జిహెచ్ఎంసి చీఫ్ సిటీ ప్లానర్ జి.వి. రఘును సంప్రదించినప్పుడు, సెల్యులార్ కంపెనీలు కోర్టుకు వెళ్ళి టవర్లు తొలగించకుండా స్టే ఉత్తర్వులు సంపాదిస్తున్నాయని తెలియజేశారు. 'కట్టడం సామర్థ్యం లేని టవర్లు అన్నిటిపై మేము నోటీసులు జారీ చేస్తున్నాం' అని రఘు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 4 March, 2010
|