ఒరిస్సాలో 'అవతార్' ఖనిజ నిక్షేపాలను వెలికి తీసేందుకు వేదాంతాకు పర్యవరణ, ఇతర చట్ట సంస్థల నుండి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. మరికొద్ది నెలల్లోనే తమకు అన్ని అనుమతులు లభిస్తాయని ఆ కంపెనీ భావిస్తోంది. ఈ గిరిజన ప్రాంతంలో వేదాంత కంపెనీ మైనింగ్ చేపడితే సుమారు 8 వేల మంది గిరిజనులకు జీవనాధారాన్ని కోల్పోతారని యాక్షన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ అంచనా వేస్తోంది. ప్రాజెక్టు క్రమంగా జాప్యమవుతుండటంతో వేదాంత చుట్టూ సమస్యలు ముసురుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం వేదాంతలో పెట్టుబడులు పెట్టిన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ తో సహా నాలుగు అంతర్జాతీయ సంస్థలు తమ వాటాను ఇప్పటికే అమ్మేసాయి. నైతిక విలువలకు కట్టుబడి తాము ఈ ప్రాజెక్టు నుండి వైదొలుగుతున్నట్లు వారు ప్రకటించారు. అలాగే బ్రిటన్ కు చెందిన రెయిన్ ట్రీ ఛారిటబుల్ ట్రస్టు గత నెలలోనే తమ 1.9 పౌండ్ల షేర్ ను విక్రయించింది. అంతేకాకుండా గిరిజనుల జీవితాలను నాశననం చేసి ఆ ప్రాంతాన్ని పారిశ్రామికీకరణ చేయాలని చూస్తోందని ఆ సంస్థ వేదాంతపై దుమ్మెత్తిపోసింది.
అవతార్ సినిమాలో నవీ తెగకు, మైనింగ్ మాఫియాకు మధ్య యుద్ధం జరిగినట్లే ఒరిస్సాలోని నియామ్ గిరి పర్వత ప్రాంతంలో కూడా గిరిజన హక్కులు - పారిశ్రామికీకరణలకు మధ్య వార్ జరుగుతోంది. అర్సెలర్ మిట్టల్, 'పొస్కో' వంటి సంస్థలు వనరులున్న గిరిజన ప్రాంతాల్లో ఇనుప ఖనిజం శుద్ధికర్మాగారాలు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ స్థానిక గిరిజనులు, గ్రామప్రజలు నుండే కాకుండా మావోయిస్టులు వైపు నుంచి కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తమ ప్రాంతంలో వనరులను కొల్లగొట్టే పరిశ్రమలు ఏర్పాటు చేసే యత్నాల పట్ల ఉద్యమిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా పేద ప్రజలతో ప్రభుత్వం, కంపెనీలు వివాదానికి దిగుతున్నాయంటే అక్కడ నిక్షిప్తమైన బాక్సైట్, ముడి ఇనుము, బొగ్గు, ఖనిజాలు వంటి లాభదాయక వనరులు ఉన్నట్లే లెక్క. వనరులున్న ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను అక్కడ నుండి ఖాళీ చేయించేందుకు ప్రభుత్వాలు చాలా ఎత్తులు వేస్తున్నాయి. అవతార్ సినిమాలో కూడా కథ అచ్చం ఇదే రీతిన సాగుతుంది. ఎక్కడో తీసిన అవతార్ సినిమా కథ ఇండియాలోని ఒరిస్సాలో నిజం కావడం యాధృచ్చికమే.
Pages: -1- 2 News Posted: 6 March, 2010
|