వైఎస్ ఆర్ యువసేన విజ్ఞప్తి
న్యూయార్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో చేసిన అనే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల కారణంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం తథ్యం అని అమెరికాలోని 'వైఎస్ ఆర్ యువసేన' అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటున్న వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమానులతో ఏర్పాటైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విశేష సంఖ్యలో వోట్లు వేసి, రికార్డు స్థాయిలో ఘన విజయాన్ని చేకూర్చిపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరెడ్డి ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాల గురించి నాగిరెడ్డి తన ప్రకటనలో ఉటంకించారు.
1) 2004 మే 14 నుంచి ఇప్పటి వరకూ రైతులకు నిరంతరాయంగా ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నారు.
2) రాష్ట్రంలోని వృద్ధులందరికీ నెల నెలా 2 వందల రూపాయలు, వికలాంగులకు 5 వందల రూపాయల చొప్పున పింఛన్ అందజేస్తున్నారు.
3) లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో అనేక సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నారు.
4) సామాన్యుల నుంచి నిరుపేదల ఆరోగ్యానికి ఆశాదీపం లాంటి 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' పథకాన్ని వైఎస్ అమలు చేస్తున్నారు. పెద్ద పెద్ద మొండి రోగాలను బాగు చేయించుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రి గుమ్మం కూడా తొక్కలేని నిరుపేదలు సైతం ఈ పథకం ద్వారా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి స్వస్థత పొందుతున్నారు.
5) ఇందిరమ్మ గృహ నిర్మాణం పేరున రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ నిరుపేదల కోసం ఇళ్లు నిర్మించి ఇస్తున్న వైనం మనం అందరికీ తెలిసిందే.
6) మహిళా సంఘాల సభ్యులకు కేవలం 25 పైసల వడ్డీకే అభివృద్ధి రుణాలు అందేజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. పావలా వడ్డీకే రుణాలు తీసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఇప్పుడు మహిళా వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.
7) వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణాలలోని నిరుపేద విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలను వైఎస్ సర్కార్ అందిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వైఎస్ కు ఉన్న నిజమైన అభిమానానికి ఈ పథకం అద్దం పడుతోంది. (గత ప్రభుత్వ హయాంలో ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగానికి చెందిన వ్యక్తి తన కుమారులు కూడా తాము చేస్తున్న వృత్తి పనులకే పరిమితం కావాల్సి వచ్చేది. అయితే, వైఎస్ ఇచ్చిన, ఇస్తున్న చేయూత కారణంగా వారి బిడ్డలెవరూ ఫీజు గురించి, డబ్బు గురించి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా చదువును కొనసాగించే అవకాశం లభించింది.)
8) కాంగ్రెస్ సర్కార్ హయాంలో వరి ధాన్యానికి మద్దతు ధర లభించింది.
9) ఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో మైనార్టీ విద్యార్థులకు రిజర్వేషన్ సౌకర్యం కాంగ్రెస్ సర్కార్ వల్లే కలిగింది.
10) కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున రైతుల రుణాలను మాఫీ చేసింది.
11) తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కిలో రెండు రూపాయలకే బియ్యం, సబ్సిడీ ధరలకే కిలో మంచినూనె, కిలో కందిపప్పు అందిస్తోంది. కిలో పది రూపాయల వంతున ప్రతి ఒక్కరికీ ఐదు కేజీల బియ్యం అందజేస్తోంది. ఈ పథకాన్ని అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని'అన్నదాతా సుఖీభవ' అనవచ్చు.
12) నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వందలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వైఎస్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
13) పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రుణాలు, మైనార్టీల అభివృద్ధి కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ను వైఎస్ సర్కార్ ఏర్పాటు చేసింది.
14) అరవై సంవత్సరాలు పైబడిన మహిళా సంఘాల సభ్యులకు నెల నెలా 5 వందల నుంచి 2200 రూపాయల వరకూ పింఛన్ అందజేసే కార్యక్రమం 'అభయ హస్తం'ను వైఎస్ సర్కార్ ఇటీవలే ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం ఇన్ని మంచి పనులు చేస్తున్న వైఎస్ సర్కార్ ను వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి వోట్లు వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని అమెరికాలోని వైఎస్ ఆర్ యువసేన అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
News Posted: 16 February, 2009
|