'నీతి అవినీతి మధ్య యుద్ధం'
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అవినీతి పాలన, తెలుగుదేశం పారదర్శక విధానాల మధ్య జరిగే యుద్ధం అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభివర్ణించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం టౌన్ బ్యాంకు చైర్మన్ వల్లూరి రామన్నచౌదరి, సాయికుమార్ ల ఆధ్వర్యంలో 300 మంది కార్యకర్తలు సోమవారంనాడు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా తన నివాసం వద్ద జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.
భూ బకాసురుడు, రావణాసురుడు, కీచకుడు, అవినీతి శేఖరుడు లాంటి బిరుదులున్న ఘనుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. అవినీతి సంపాదనలో ఢిల్లీకి వైఎస్ క్రమం తప్పకుండా వాటాలు పంపినా వోటాన్ అకౌంట్ బడ్జెట్ లో మన రాష్ట్రానికి మొండిచెయ్యే చూపించారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో అగ్రస్థానం పొందిన ఆంధ్రప్రదేశ్ ను అవినీతిలో ముందుకు తీసుకుపోయిన కాంగ్రెస్ పార్టీ చిట్టచివరి ముఖ్యమంత్రిగా వైఎస్ మిగిలిపోతారని ఆయన దుయ్యబట్టారు. సత్యం, మేటాస్, సాక్షి కుంభకోణాలు, వైఎస్ బంధువుల, అనుచరుల భూ కబ్జాల గురించి ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కాగా, కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి పసుపు కండువాలు కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొడ్డు భాస్కర రామారావు, నియోజకవర్గం ఇన్ చార్జి వేగుళ్ళ జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 17 February, 2009
|