బాబూ విచారణకు సిద్దం కండి
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతిపై జాతీయ స్థాయిలో ఆందోళనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాల్ని లోక్ సత్తా పార్టీ స్వాగతించింది. అయితే రాష్ట్రాభివృద్ధికి శాపంగా మారిన అవినీతిని నిర్మూలించాలంటే కేవలం పార్లమెంటులో కాసేపు చర్చ లేవనెత్తటం, రాష్ట్రపతి, ఇతర రాజ్యాంగసంస్థల అధిపతులకు విజ్ఞాపన పత్రాలివ్వటం సరిపోదని లోక్ సత్తా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, వి.లక్ష్మణ్ బాలాజీ అన్నారు. ప్రజా జీవితంలోని నేతలు ముందు ఆదర్శంగా నిలవాల్సుందన్నారు. తమమీద ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతిని విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తానని, వారి అక్రమ ఆస్తులు జప్తు చేయడానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తానని పదే పదే చెబుతున్న చంద్రబాబు... తన మీద, తన కుటుంబ సభ్యుల ఆస్తుల మీద కూడా అదే తరహాలో నిష్పాక్షిక విచారణ జరిపించి ఆదర్శంగా నిలవాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ లాగే, చంద్రబాబు కూడా పదవిలోకి వచ్చాకే బిలియనీర్ అయ్యారని పేర్కొన్నారు. రాజకీయ అవినీతి మీద ప్రత్యేక కోర్టులో విచారణపై చంద్రబాబు ద్వంద్వవైఖరిని శ్రీనివాసరావు, లక్ష్మణ్ బాలజీ మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా దుయ్యబట్టారు.
రాష్ట్రంలో గత 15ఏళ్ల క్రితం నుంచే రాజకీయ అవినీతి పెచ్చుమీరి పోయిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి , గత ముఖ్యమంత్రి మీదే ప్రధానంగా భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయని లోక్ సత్తా పార్టీ నేతలు అన్నారు. వైఎస్, చంద్రబాబు స్వయంగా పరస్పర ఆరోపణలు చేసుకున్నారన్నారు. నువ్వు దొంగ అంటే నువ్వు గజదొంగ అని వైఎస్, చంద్రబాబు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వారిద్దరూ ఒకరి గురించి ఒకరు నిజాలే చెప్పుకున్నారని లోక్ సత్తా విశ్వసిస్తోంది. అందుకే ఆ ఆరోపణల మీద ప్రత్యేక కోర్టులో విచారించాలని మేం తొలి నుంచి డిమాండ్ చేస్తున్నాం. చాలాకాలం మా డిమాండ్ ను విననట్టు నటించిన చంద్రబాబు... ఇప్పుడు ఆ ప్రత్యేకకోర్టులో కేవలం వైఎస్ అవినీి మీద మాత్రమే విచారణ చేయిస్తామంటున్నారు. తన గురించి మాత్రం గురివిందగింజ వైఖరితో వ్యవహరిస్తున్నారు. తనమీద కూడా ప్రత్యేక కోర్టులో విచారణకు ఆయన సిద్దమవ్వాలి అని డిమాండ్ చేశారు.
News Posted: 17 February, 2009
|