హైదరాబాద్ : ర్యాగింగ్ కు గురైన విద్యార్థి హేమంత్ రెడ్డి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ఉప్పల్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాగింగ్ కు గురైన తమ కుమారుడికి న్యాయం చేయాలంటూ వారు మంగళవారం ఉదయం కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. హేమంత్ రెడ్డి ఇదే కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ర్యాగింగ్ చేసిన కళాశాల సీనియర్లపై చర్యలు తీసుకోకుండా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. వారికి తోడుగా జూనియర్ విద్యార్థులు కూడా ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ముప్పైం మంది సీనియర్ విద్యార్థులు ముగ్గురు జూనియర్లను ఆదివారంనాడు ఒక గదిలో వేసి దాడి చేశారు. సీనియర్ల పైశాచిక దాడిలో తీవ్రంగా గాయపడిన హేమంత్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.