బస్సులు దగ్ధం చేసిన దండోరా
హైదరాబాద్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి ఎమ్మార్పీయస్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టి తగలబెట్టారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న రేతిఫైల్ బస్టాప్ లో ఆగి ఉన్న రాణిగంజ్ లోని రెండవ నెంబర్ డిపోకు చెందిన ఎ.పి. 29 యు 1338 అనే నెంబర్ గల బస్సును బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎమ్మార్పీయస్ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగులబెట్టారు. అలాగే లాల్ బహదూర్ స్టేడియం సమీపంలో రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ముషీరాబాద్ డిపోకు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును ఆందోళనకారులు దగ్ధం చేశారు. రెండు బస్సులు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. దీనితో అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రదేశాలకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, బస్సులను తగులబెట్టింది తామే అంటూ ఎమ్మార్పీయస్ కార్యకర్తలు పలు చానళ్ళ కార్యాలయాలకు ఫోన్లు చేసి చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీయస్ కార్యకర్తలు గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని బస్సులను కూడా వారే దగ్ధం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
News Posted: 26 February, 2009
|