బస్సుల తరలింపుపై సత్తా గుర్రు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బహిరంగ సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను తరలించడాన్ని లోక్ సత్తా పార్టీ తప్పు పట్టింది. బస్సులను తరలించడం ద్వారా నగరంలోని 40 లక్షల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టే అధికారం ఎవరిచ్చారని సత్తా నిలదీసింది. పాలన చివరి దశకు వచ్చే సరికి అధికార కాంగ్రెస్ పార్టీ విచక్షణ లేకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సత్తా దుమ్మెత్తిపోసింది. సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లోనిర్వహించిన సోనియా బహిరంగ సభకు జనాలను తరలించేందుకు హైదరాబాద్ నగరంలో అనేక సిటీ మార్గాల్లో తిరిగే బస్సులను హఠాత్తుగా తరలించడం నీతిమాలిన చర్య అని తప్పుపట్టింది. నిబంధనలకు నీళ్ళొదిలిన ఆర్టీసి వందలాది బస్సులను జనసమీకరణ కోసం కేటాయించడాన్ని లోక్ సత్తా అధికార ప్రతినిధి కటారి శ్రీనివాసరావు, గ్రేటర్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు నందిపేట రవీందర్ విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం అనాలోచిత చర్య కారణంగా రోజువారీ పనులకు వెళ్ళేవారు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు ఉదయం 8 గంటల నుంచే బస్టాప్ ల వద్దకు వచ్చినా ఎంతసేపటికీ బస్సులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ హోర్డింగ్ లు, బ్యానర్ల విషయంలో మొద్దు నిద్ర పోతున్న జిహెచ్ ఎంసీ.. సోనియా గాంధీ సభకు మాత్రం ఆగమేగాల మీద ఏర్పాట్లు ఘనంగా చేసిందని సత్తా నాయకులు ఎద్దేవా చేశారు. జనం తరలింపులో కొందరు అధికారులు కూడా తమ వంతు కృషి చేయడాన్ని వారు ప్రశ్నించారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన తప్పిదానికి ఆర్టీ సిటీ జనరల్ మేనేజర్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని, నైతిక విలువలు ఏ మాత్రం ఉన్నా రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ తమ పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని శ్రీనివాసరావు, రవీందర్ డిమాండ్ చేశారు.
News Posted: 28 February, 2009
|