బాలయోగికి బాబు నివాళి
హైదరాబాద్ : మంచి నడవడిక, హుందాతనం, సంయమనం, మానవ విలువలతో ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ విషయం దివంగత లోక్ సభ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి నిజం చేశారని ఆయన కొనియాడారు. బాలయోగి 7వ వర్ధంతిని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాలయోగికి ఘనంగా నివాళులు అర్పించారు.
బాలయోగిని లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా టిడిపి నిర్ణయించినప్పుడు ఆ పదవిలో ఆయన రాణించగలరా అని అనేక మంది అనుమానం వ్యక్తం చేశారని, అయితే వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన అనతికాలంలోనే అన్ని పార్టీల నాయకుల మన్ననలు పొందారన్నారు. లోక్ సభ స్పీకర్ పదవిని బాలయోగి ఎంతో హుందాగా, సంయమనంతో నిర్వహించారని చంద్రబాబు శ్లాఘించారు.
బాలయోగిని లోక్ సభ స్పీకర్ ను చేయడం ద్వారా అంతటి ఉన్నత పదవికి ఒక దళితుని అవకాశం కల్పించిన ఘనత తెలుగుదేశానిదే అని చంద్రబాబు చెప్పుకున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా బాలయోగి ఉన్నప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు పాటించారన్నారు. లోక్ సభ సభ్యునిగా, స్పీకర్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వర్గీయ బాలయోగి అహర్నిశలూ శ్రమించారని చంద్రబాబు కొనియాడారు. చెరగని చిరునవ్వుతో రాష్ట్ర ప్రజలకు నిత్యం ఆయన అందుబాటులో ఉండేవారని, అంతటి మంచి మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. స్వర్గీయ బాలయోగి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రావుల చంద్రశేఖరరెడ్డి, శ్రీమతి నన్నపనేని రాజకుమారి, టి.డి. జనార్దన్ రావు, బోడకుంట వెంకటేశ్వర్లు, తీగల కృష్ణారెడ్డి, పలువురు టిడిపి కార్యకర్తలు బాలయోగికి నివాళులు అర్పంచారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
News Posted: 3 March, 2009
|