ఇంటర్ పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పరీక్షలు బుధవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యాయి. ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ జరిగే ఈ పరీక్షలు ఈ నెల 24తో పూర్తవుతాయి. కాగా, ద్వితీయ లాంగ్వేజ్ పరీక్షకు సంబంధించిన సెట్ నెంబర్ 1 ప్రశ్నాపత్రాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి బలరామయ్య విడుదల చేశారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రశ్నాపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి.
ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రంలో మొత్తం 2,204 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్నంత సేపూ పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. మొత్తం 92 ఫ్లయింగ్ స్క్వాడ్ లతో పాటు 115 సిటింగ్ స్క్వాడ్ లను కూడా బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తంలో 320 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 17,55,502 మంది విద్యార్థుల్లో మొదటి సంవత్సరం విద్యార్థుల 8,60,568 ఉన్నారు. మొత్తం 8,94,934 మంది రెండో సంవత్సరం విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. ఇలా ఉండగా ఇంటర్ పరీక్షకు వెళ్ళే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది.
కాగా, హాల్ టికెట్ల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుంటూరు జిల్లా వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కు ఇంటర్ బోర్డు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఇంటర్ మార్కులను ఎంసెట్ కు వెయిటేజిగా నిర్ణయించడంతో పరీక్షల్లో అవకతవకలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ వెయిటేజ్ ఈ సంవత్సరం నుంచే అమలులోకి వస్తోంది.
ప్రతి పరీక్షా కేంద్రంలోనూ మంచినీటితో పాటు ప్రతి రెండు కేంద్రాలకు ఒక మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ను కిట్ తో సహా ఉంచుతున్నారు.
News Posted: 4 March, 2009
|