హైదరాబాద్ : రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మొట్టమొదటిసారిగా ఎన్నికల నియమావళిని తెలుగులో ప్రచురించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన నియమాలను తెలుగులో ముద్రించిన ఇరవై అయిదు లక్షల పుస్తకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వీ.సుబ్బారావు శనివారం విడదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలన్న ఉద్యేశంతోనే ప్రాంతీయ భాషలో నియమావళిని ప్రచురణ చేశామన్నారు. ఓటర్లను మేల్కొలిపేందుకు ఎలక్ట్రానిక్ యంత్రాల వాడకంపై కూడా తెలుగులోనే వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా ఎన్నికల నియమావళిని తెలుగులో ప్రచురించడంతో తెలుగు భాషా సంఘం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.