కోదాడలో కాంతారావు విగ్రహం
హైదరాబాద్ : అనారోగ్యంతో ఆదివారం రాత్రి హైదరాబాద్ లో కన్నుమూసిన జానపద చిత్రాల కథానాయకుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు విగ్రహాన్ని ఆయన పుట్టిన మండలం కోదాడలో ఏర్పాటు చేయనున్నట్లు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్ లో ఉంచిన కాంతారావు పార్దివ శరీరాన్ని సోమవారం సందర్శించిన చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మదిర బ్రహ్మారెడ్డి సహాయంతో కాంతారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సినీ రంగంలో మహోన్నత శిఖరాలను కాంతారావు అధిరోహించారని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను కాంతారావు పొందారన్నారు. తన నటనా శైలితో కాంతారావు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆయన నివాళులు అర్పించారు. కాంతారావు మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటు అన్నారు. సౌమ్యుడిగా, ధనాశ లేని పేదవాడిగి జీవితాన్ని ముగించడం ఆయన గొప్పతనాన్ని సూచిస్తున్నదన్నారు. కాంతారావు విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చిన మదిర బ్రహ్మారెడ్డికి చంద్రబాబు అభినందించారు.
News Posted: 23 March, 2009
|