కాంగ్రెస్ మేనిఫెస్టోపై సత్తా విసుర్లు
హైదరాబాద్ : పాత పథకాలు, విధానాలనే తిప్పి తిప్పి చెబుతూ రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేయడమే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశం అని లోక్ సత్తా పార్టీ నిశితంగా విమర్శించింది. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క తప్పును కూడా సరిదిద్దుకోకుండా మళ్ళీ అవే తప్పులను జనం మీదికి వదిలేందుకు సిద్ధమైందని విమర్శించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల ప్రణళిక ప్రజలకు సొంత ఆదాయం, ఆత్మగౌరవం కల్పించే విధంగా లేదని సత్తా అధికార ప్రతినిధులు పి. రవి మారుత్, డాక్టర్ పి. భాస్కరరావు ఆరోపించారు. ప్రజలను శాశ్వత బిచ్చగాళ్ళుగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై రవిమారుత్, భాస్కరరావు సోమవారంనాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రతిస్పందించారు.
సమాజం, వ్యక్తి అభివృద్ధికి అత్యంత కీలకమైన విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తప్పిదాల్ని సరిదిద్దుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించలేదని లోక్ సత్తా అభిప్రాయపడింది. కాంగ్రెస్ విధానాలతో ముందుకెళితే రాష్ట్రం గుల్లబారిపోవడం ఖాయమని సత్తా ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక మాంద్యాన్ని దీటుగా ఎదుర్కొనేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న తీరు అధికార కాంగ్రెస్ లో ఏ కోశానా కనిపించడం లేదని విమర్శించింది. ప్రజలను ఏదో విధంగా మభ్య పెట్టి ఓట్లు దండుకొని మళ్ళీ అధికారం చేపట్టాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోందన్నారు. మౌలిక రంగాల్లో ఎలాంటి పటిష్ట చర్యలూ చేపట్టకుండా ఉన్న ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలను జీవచ్ఛవాల్లా, ఓటు వేసే యంత్రాలుగా మార్చాలన్నదే కాంగ్రెస్ కుయుక్తి అని లోక్ సత్తా దుయ్యబట్టింది.
News Posted: 23 March, 2009
|