కాపు సంఘం ఉగాది సంబరాలు
హైదరాబాద్ : ప్రతి సంవత్సరమూ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాలను శ్రీ విరోధి నామ సంవత్సర ప్రారంభ ఉగాది రోజున కూడా తెలగ, బలిజ, కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జస్టిస్ ఐ. వెంకటనారాయణ, ఆర్.వి. రామమోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులైన పలువురికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. 2009 మార్చి 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి పురస్కారాల ప్రదాన కార్యక్రమం లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ లోని సంఘం కార్యాలయం ఆవరణలో ప్రారంభం అవుతుందని వారు వివరించారు.
ఈ సంవత్సరం ఉగాది పురస్కార గ్రహీతలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. గోపాలకృష్ణ, ఇ.ఎస్.సి.ఐ. డైరెక్టర్ డాక్టర్ శెనక్కాయల నాగభూషణరావు, ప్రసిద్ధ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, తులసి సీడ్స్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త తులసి రామచంద్రప్రభు, జనరల్ రాధాకృష్ణ, జనరల్ యెగ్గిన విష్ణుమోహన్, రిటైర్డ్ డిజిపి ఎం.వి. భాస్కరరావు, డాక్టర్ పిళ్ళా నాగేశ్వరరావు, డాక్టర్ పి. హనుమంతరావులను ఎంపిక చేసినట్లు వెంకటనారాయణ, రామమోహన్ రావు వెల్లడించారు.
శ్రీ విరోధ నామ సంవత్సరం ఉత్సవాలను పురస్కరించుకొని సాయంత్రం 4 గంటలకు తేనీటి విందు, సంఘీయుల, ఆత్మీయుల సమావేశం ఉంటుంది. 4.30కు ప్రార్థన, 5 గంటలకు శ్రీ విరోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని డాక్టర్ కొట్టే వేంకటాచార్యులు నిర్వహిస్తారు. అనంతరం అధ్యక్షోపన్యాసం, సన్మాన గ్రహీతలను వేదిక మీదకు ఆహ్వాన కార్యక్రమం ఉంటుందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెల్లడించారు. సన్మాన గ్రహీతల పరిచయాన్ని రావూరి వెంకట రామమోహన్ రావు చేస్తారు. అనంతరం ఉగాది పురస్కారాలు, సన్మానం, బిరుదు ప్రదానం ఉంటాయని వివరించారు. తరువాత కాపు యువతీ యువకులకు 'మిస్టర్ కాపు', 'మిస్ కాపు' పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలో విజేతలకు వెయ్యి రూపాయలు, రెండో స్థానంలో ఉన్న వారికి 5 వందల రూపాయల నగదు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. అనంతరం సంఘీయుల చిన్నారుల సంగీత విభావరి, నృత్య కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమం వందన సమర్పణ తరువాత అల్పాహార విందు ఏర్పాటు చేసినట్లు కాపు, తెలగ, బలిజ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వివరించారు. ఈ కార్యక్రమానికి సంఘీయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
News Posted: 26 March, 2009
|