ఆయుధంగా బ్యాలెట్: జెపి
హైదరాబాద్ : సంప్రదాయ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అనైతిక విధానాలపై లోక్ సత్తా నిరంతర పోరాటం చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు, కూకటపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. రాజకీయాలను పవిత్ర వ్యాసంగంగా, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే మార్గంగా లోక్ సత్తా భావిస్తున్నదన్నారు. కొత్త రాజకీయ సంస్కృతిని నిర్మించడమే లోక్ సత్తా పార్టీ ఎజెండా అన్నారు. ప్రజలంతా తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఉపకరించే స్వచ్ఛమైన రాజకీయాల కోసం సత్తా ముందుకు వెళ్తోందన్నారు. బ్యాలెట్ ను ఆయుధంగా ఉపయోగిస్తే తప్పకుండా లోక్ సత్తా గెలిచి తీరుతుందని జెపి తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నూరిపోశారు. మలక్ పేటకు చెందిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
లోక్ సత్తాకు తప్ప మరే సాంప్రదాయ పార్టీకి ఓటు వేసినా అది నిరర్ధకమే అవుతుందన్నారు. కేవలం మూడు కుటుంబాల ఆధీనంలో మగ్గిపోతారో లోక్ సత్తాకు ఓటేసి కొత్త రాజకీయానికి ప్రాణం పోస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. అనంతరం లోక్ సత్తా మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ ఎ. పాండురంగారావు మాట్లాడారు. జెపి విధానాల పట్ల ఆకర్షితుడైన రంగారావు బహుళ జాతి సంస్థలో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా రిటైరైన తరువాత లోక్ సత్తాలో చేరారు. మానవ వికాస కేంద్ర అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.
News Posted: 27 March, 2009
|