హైదరాబాద్ : అక్షయ తృతియ రోజు గ్రామైనా బంగారం కొంటే మంచిదన్న సెంటిమెంట్ ఉన్నవారు సైతం ఈ అక్షయతృతియకు వెనకడుగు వేశారు. పెద్ద పెద్ద కంపెనీలతో పాటు ఆర్థిక మాంద్యం ప్రభావం అక్షయ తృతీయ పైనా పడింది. పెరిగిన బంగారం ధరలతో గత రెండు నెలలుగా బంగారం అమ్మకాలు సరిగా లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. చివరకు అక్షయ తృతియ రోజుకూడా జోరుగా అమ్మకాలు సాగకపోవడంతో వ్యాపారులు నిరాశచెందుతున్నారు. సంపన్న వర్గాల వారు తప్పితే మధ్యతరగతి వారు ఆర్థికమాంద్యంతో ఖర్చు ఎందుకులే అనుకొని మానుకోవడమే ఇందుకు కారణంగా కొనుగోలు దారులు చెబుతున్నారు. దీంతో బంగారపు దుకాణాల్లో సందడి కొరవడింది.