సూట్ కేస్ శవం కలకలం
హైదరాబాద్ : సూట్ కేసులో శవం బుధవారంనాడు హైదరాబాద్ లో కలకలం రేపింది. నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ క్లోక్ రూమ్ లో క్రితం భద్రం చేసిన ఒక సూట్ లో ఒక యువకుని శవం లభ్యమైంది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఎంజిబిఎస్ సామానులు భద్రపరిచే గదిలో ఉంచిన సూట్ కేసు నుంచి బుధవారం దుర్వాసన వస్తుండడంతో క్లోక్ రూమ్ నిర్వాహకుడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బస్ స్టేషన్ కు వచ్చి సూట్ కేసును తెరచి చూడగా ఒక యువకుని మృతదేహం మడతపెట్టి ఉంది. మృతుని దుస్తులను పరిశీలించిన పోలీసులకు సాయిప్రసాద్ పేరుతో పదవ తరగతి పాసైన సర్టిఫికెట్ లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సూట్ కేసులో మృతదేహం ఉదంతంపై క్లోక్ రూమ్ నిర్వాహకుడు మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఈ సూట్ కేసును తమ వద్ద భద్రపరిచాడన్నారు. సూట్ కేసులో పుస్తకాలున్నాయనుకొని తాము దానిని భద్రపరిచామన్నారు. రెండు రోజులైన సూట్ కేసు కోసం ఎవరూ రాలేదని, పైగా బుధవారం ఉదయం సూట్ కేస్ నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పాడు.
News Posted: 13 May, 2009
|