బస్ షెల్టర్లకై సత్తా డిమాండ్
హైదరాబాద్ : నగరంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్న 20 ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని లోక్ సత్తా ఆవేదన వ్యక్తం చేసింది. నగరంలోని 20 ప్రధాన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికపై బస్ షెల్టర్లు నిర్మించాలన్న డిమాండ్ తో జిహెచ్ ఎంసి కమిషనర్ కు బుధవారంనాడు వినతిపత్రం సమర్పించింది. ఆ వినతిపత్రంలో సర్వే వివరాలు, వేలాది మంది ప్రయాణికుల నుంచి సేకరించిన సంతకాలను కూడా లోక్ సత్తా పొందుపరిచింది. షెల్టర్లు లేనందున ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పడుతున్న అవస్థల గురించి లోక్ సత్తా నడుం బిగించింది. ఈ క్రమంలో లోక్ సత్తా యువజన విభాగం కార్యకర్తలు ఈ నెల 2 నుంచి నగరంలో పలు చోట్ల సర్వే నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ఎండ తీవ్రత నుంచి తప్పించుకునే చర్యలను వీరు అవగాహన కల్పించారు. జిహెచ్ ఎంసి కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన వారిలో లోక్ సత్తా గ్రేటర్ హైదరాబాద్ విభాగం నాయకులు ఎ. సుభాషిణి, పగడాల వెంకటేశ్వరరావు, బాలగంగాధర తిలక్ ఉన్నారు.
హైదరాబాద్ లో ప్రతిరోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకున్న జిహెచ్ ఎంసి అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా బస్ షెల్టర్లు ఏర్పాటు చేయలేదని లోక్ సత్తా నాయకులు ఆరోపించారు. హైటెక్ బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామంటూ రెండేళ్ళుగా ఊరిస్తున్న జిహెచ్ ఎంసి బస్టాపుల్లో ప్రయాణికులు కనీసం నిలబడేందుకు కూడా సౌకర్యం లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్ సత్తా గుర్తించిన బస్ షెల్టర్లు లేని ప్రాంతాలు ఇవి :
1) లిబర్టీ బస్ స్టాప్ (టిటిడి వద్ద), 2) హిమాయత్ నగర్ బస్ స్టాప్ (ఉర్దూ హాల్ వద్ద - రోడ్డుకు ఇరుపక్కలా), 3)నారాయణగూడ బస్ స్టాప్ (ఫ్లై ఓవర్ వద్ద - రెండు పక్కలా, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వద్ద), 4) పంజాగుట్ట బస్ స్టాప్ (నిమ్స్ ఎదురుగా), 5) బాగ్ లింగంపల్లి (అంబేద్కర్ కాలేజి ఎదురుగా, పక్కన), 6) మెహిదీపట్నం (చిల్కూరు దేవాలయం బస్టాప్ వద్ద), 7) సైనిక్ పురి (వాయుపురి), 8) ఈసీఐఎల్ క్రాస్ రోడ్, 9) ఎల్బీనగర్ రింగ్ రోడ్డు, 10) సాగర్ రింగ్ రోడ్, 11) జియాగూడ కేసరి హనుమాన్ దేవాలయం (2 జె ప్రారంభ పాయింట్), 12) తాళ్ళగడ్డ బస్ స్టాప్ (118 టి, 6 టి ప్రారంభ పాయింట్), 13) లింగంపల్లి క్రాస్ రోడ్ (వైన్ షాప్ పక్కన), 14) కాచిగూడ క్రాస్ రోడ్, 15) రామకృష్ణ మఠం (రెండుపక్కలా), 16) ఎస్పీరోడ్, ప్యాట్నీ (సికిందరాబాద్), 17) చిలకలగూడ (సికిందరాబాద్), 18) బోయినపల్లి ధాబా, 19) ఆర్పిరోడ్, బాటా (సికిందరాబాద్), 20) రంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా బస్ స్టాప్ లను ఏర్పాటు చేయాలని లోక్ సత్తా తన వినతిపత్రంలో డిమాండ్ చేసింది.
News Posted: 13 May, 2009
|