కేజీ బంగారం చోరీ
హైదరాబాద్ : బంగారు దుకాణం యజమానిపై పట్టపగలే మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, కేజీ బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు. హైదరాబాద్ శివార్లలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎ.ఎస్. రావు నగర్ లో గురువారం ఈ సంఘటన జరిగింది. బంగారం కొనుగోలు చేస్తామంటూ దుకాణంలోకి వచ్చిన ఇద్దరు ఆగంతకులు దుకాణం యజమాని ముఖేశ్ అగర్వాల్ పై కత్తులతో దాడి చేశారు. దుండగులు దాడి చేసిన సమయంలో ముఖేశ్ అగర్వాల్ ఒక్కరే దుకాణంలో ఉన్నారు. పని మీద బయటికి వెళ్ళిన దుకాణంలో పనిచేసే సహాయకుడు తిరిగి వచ్చే సరికి ముఖేశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీనితో నగల దుకాణంలో చోరీ జరిగినట్లు తెలిసింది. ముఖేశ్ అగర్వాల్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడి, చోరీ సమాచారం అందిన వెంటనే కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 21 May, 2009
|