లోక్ సత్తాలో కార్వాన్ యువత
హైదరాబాద్ : పుట్టిన ప్రతి బిడ్డకూ రాజకీయంగా ఎదిగే అవకాశాలు అందించేందుకు లోక్ సత్తా పార్టీ చక్కని వేదికగా ఉపయోగపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. లోక్ సత్తా పార్టీని ప్రతి యువతీ, యువకుడూ తన పార్టీగా భావిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు రావాలని యువత కోరుకుంటున్నదన్నారు. పన్నెండు పదమూడేళ్ళ వయస్సున్న ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ఇటీవల ఎన్నికల్లో లోక్ సత్తాకు ఓటు వేయమని కోరడం తాము సాధించిన విజయం అని ఆయన అభివర్ణించుకున్నారు. నిజమైన రాజకీయం రావాలంటే జనం చేతికి అధికార పగ్గాలు అందినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి ఆదివారం నాడు రెండు వందల మంది యువకులు, స్థానిక నాయకులు జెపి సమక్షంలో లోక్ సత్తా పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడారు.
సంప్రదాయ పార్టీల్లో రాజకీయాలంటే ఎన్నికలతో ప్రారంభమై ఎన్నికలు పూర్తవగాని ముగిసిపోవడం రివాజుగా మారిందని జె.పి ఎద్దేవా చేశారు. ఆయా సంప్రదాయ పార్టీల నాయకులు పైరవీలతో కాలం వెళ్ళబుచ్చుతుండగా, లోక్ సత్తాలో మాత్రం ఎన్నికల తరువాత నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారన్నారు. పార్టీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కార్వాన్ నుంచి రెండు వందల మంది యువకులు పార్టీలో చేరడమే దీనికి ఉదాహరణ అన్నారు.
యువతరం నుంచి మెరుగైన నాయకత్వం రావాలని ఈ సందర్భంగా పార్టీలో కొత్తగా చేరిన వారిని ఉద్దేశించి జెపి అన్నారు. నిత్యమూ జనం చుట్టూ అధికారాన్ని తిప్పటం, అందు కోసం నీతి, నిజాయితీతో పనిచేయడం లోక్ సత్తా లక్ష్యం అన్నారు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు యువత సమాయత్తం కావాలని జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.వి. రావు, పరమేష్ కుమార్, కార్వాన్ ఇన్ చార్జి మాణిక్ ప్రభు, గ్రేటర్ హైదరాబాద్ లోక్ సత్తా అధ్యక్షుడు ఎన్. రవీందర్, యువసత్తా అధ్యక్షుడు దాసరి రత్నం తదితరులు పాల్గొన్నారు.
News Posted: 25 May, 2009
|