'సాక్షి'పై దాడికి సత్తా ఖండన
హైదరాబాద్ : సాక్షి దినపత్రిక కార్యాలయంపై జరిగిన దాడిని లోక్ సత్తా పార్టీ తీవ్రంగా ఖండించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని సాక్షి కార్యాలయంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి విధ్వంసం చేయడాన్ని లోక్ సత్తా అధికార ప్రతినిధులు నందిపేట రవీందర్, డివిఎస్ వర్మ ఒక ప్రకటనలో ఖండించారు.
సమాజంలో పత్రికల పాత్ర ప్రముఖమైనదని, పత్రికలు లేకుండా ప్రజాస్వామ్యం మనుగడను ఊహించలేమని, పత్రికలపై దాడి జరగడం అంటే నేరుగా ప్రజలపై దాడి చేయడమే అని రవీందర్, వర్మ అభివర్ణించారు. పత్రికా కార్యాలయంపై పెట్రోల్ తో దాడి చేయడం, విలేఖరిని గాయపరచడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే అన్నారు. మీడియాపైన, జర్నలిస్టులపైన ఇటీవలి కాలంలో తరచూ దాడులు జరుగుతున్నాయని, ఇది శాంతి భద్రతల వైఫల్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు ప్రజల నిర్ణయాధికారంపై ఆధారపడి ఉంటాయని, తమ వైఫల్యాలకు మీడియాను, విలేఖరులను బాధ్యులను చేసి ప్రతీకార చర్యలకు దిగడం అనైతికం అన్నారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించకూడదని, పునరావృతం కాకుండా చట్ట ప్రకారం దోషులను శిక్షించాలని లోక్ సత్తా అధికార ప్రతినిధులు తమ ప్రకటనలో డిమాండ్ చేశారు.
News Posted: 26 May, 2009
|