వైఎస్ కు ఫ్యాప్సీ అభినందన
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి, మంత్రిపదవులు చేపట్టిన వారికి ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఫ్యాప్సీ అధ్యక్షుడు సూరజ్ ప్రసాద్ అగర్వాల్ మంగళవారంనాడు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. మంత్రివర్గంలో వివిధ వర్గాలు, ప్రాంతాల నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి చక్కని ప్రాధాన్యం కల్పించారని అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో కొత్తగా మంత్రులుగా చేరిన వారు నూతన ఆలోచనలతో రాష్ట్రానికి చక్కని పరిపాలన అందించగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. క్యాబినెట్ లో సీనియర్ మంత్రులు కొత్త మంత్రులకు సరికొత్త ప్రణాళికలు, రూపకల్పనలో మంచి ఫలితాలు సాధించేందుకు సహాయ సహకారాలు అందించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో ముఖ్యంగా వాణిజ్యం, పరిశ్రమ రంగాల్లో ముందుకు నడిపించే దిశగా కొత్త మంత్రివర్గానికి హృదయపూర్వకంగా సహాయం అందించేందుకు ఫ్యాప్సీ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలోను, డిమాండ్ సప్లైల మధ్య దూరాన్ని తగ్గించడంలోనూ కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఫ్యాప్సీ అధ్యక్షుడు అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.
News Posted: 26 May, 2009
|