హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. పేషెంట్ బంధువులు తమపై దాడి చేయడాన్ని వారు నిరసించారు. విధుల్లో ఉన్న తమకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ గర్భిణి మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందింది ఆరోపిస్తూ డాక్టర్లపై దాడిచేశారు. ఈ సంఘటనతో నేడు జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. కాగా ఈ ఘటనపై స్పందించిన వేద్యశాఖ మంత్రి దానం నాగేందర్ డాక్టర్లను మానవతా దృక్పదంతో విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందినట్లు రుజువైతే అందుకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.