తగ్గిన 'తానా' ఎంట్రీ ఫీజు
షికాగో : అమెరికా తెలుగువారికి రెండేళ్లకోసారి వచ్చే పెద్దపండుగ మరో పది రోజుల్లో ప్రారంభం కాబోతోంది... ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలు ఆంధ్రదేశానికీ అమెరికాకూ మధ్య సాంస్కృతిక వారధిలా నిలుస్తూ అతిపెద్ద తెలుగు పండుగగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. జూలై 2 నుంచి 4వ తేదీ దాకా జరిగే 17వ ద్వైవార్షిక మహాసభలకు వేదికైన షికాగో నగరానికి ఇప్పటికే పండగకళ వచ్చింది. మునుపెన్నడూ లేనంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ సభలకు పది వేల మంది హాజరవుతుండడంతో తగిన ఏర్పాట్లు చేయడానికి సంబంధిత కమిటీలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
ఎంత లేదన్నా ఆర్థిక మాంద్యం ప్రభావం ఎంతో కొంత తెలుగువారిపై కూడా ఉందన్న వాస్తవాన్ని గుర్తించి ఈసారి తక్కువ ఖర్చు కాగల రోజువారీ పాసులను అందుబాటులోకి తెచ్చారు. ఎప్పటి మాదిరిగా కుటుంబాల రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగిస్తూనే, భోజనం ప్యాకేజితో సంబంధం లేకుండా కేవలం సభలలో హాజరయ్యేందుకు వచ్చేవారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఒకరోజు పాస్ కు 50 డాలర్లు, రెండు రోజుల పాస్ కు 80 డాలర్లు చెల్లించవలసి ఉంటుంది. ఇలా తగ్గింపు ధరలతో సభలలో పాల్గొన్నవారి తమ ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలను విడిగా డబ్బు చెల్లించి కొనుక్కోవలసి ఉంటుంది. ఇప్పటిదాకా టిక్కెట్ ధరలోనే మొత్తం భోజనం ప్యాకేజి కూడా కలిసి ఉండేది.
ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఒకరోజు, రెండు రోజుల ప్యాకేజిలను ప్రవేశపెట్టవలసిందిగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈసారి ప్రత్యేక పాస్ లను అందుబాటులోకి తెచ్చారు. తగ్గింపు ప్యాకేజి ప్రకటించిన తర్వాత రిజిస్ట్రేషన్లు మరింత ఊపందుకున్నాయి. ఇంకా తమ పేర్లు నమోదు చేసుకోదలచిన వారు నేరుగా తానా సభల ప్రత్యేక వెబ్ సైట్ http://www.tana09.com/ లో నమోదు చేసుకోవచ్చు.
Pages: 1 -2- -3- -4- News Posted: 22 June, 2009
|