పాఠశాలలపై నేతల దాడి
హైదరాబాద్ : ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన ప్రైవేట్ పాఠశాలలు ఒకదానికి మించి మరో స్కూల్ ఫీజులను పెంచడంలో ఆసక్తి కనబరుస్తున్నాయి. మధ్యతరగతి త్లలితండ్రులు తమ పిల్లలకు ఉన్నత విద్య ప్రైవేట్ పాఠశాలల ద్వారానే లభిస్తుందన్న అభిప్రాయంతో వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకే పంపడానికి మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరా చేసుకుని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం భారీగా ఫీజులను పెంచేస్తున్నారు. ఆర్థికమాద్యంతో అల్లాడుతున్న మధ్యతరగతి తల్లితండ్రులు, విద్యార్థులు ఆగ్రహించి పాఠశాలలపై దాడులకు దిగుతున్నారు. దీంతో లక్షల ఆస్తి నష్టం జరుగుతోంది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, విఠల్ వాడిలోని ప్రైవేటు పాఠశాలలపై ఏఐఏస్ ఎఫ్ కార్యకర్తలు దాడులకు దిగారు. గౌతమ్ మోడల్ స్కూల్, నారాయణ కాన్సెప్ట్ స్కూళ్ళల్లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పాఠసాల బస్సు అద్దాలను పగలకొట్టి తదుపరి మరో స్కూల్ పై దాడికి ప్రయత్నిస్తుండగా ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాజమాన్యాలు పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని విద్యార్థి సంఘం నేతలు హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు మండిపోతుండుగా మరో వైపు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కూడా ఫీజులను పెంచేసింది. దీంతో సగటు మధ్యతరగతి ప్రజలు అటు బ్రతకలేక ఇటు చావలేక నానా అగచాట్లు పడుతున్నారు.
News Posted: 26 June, 2009
|