గ్రేటర్ సత్తా అభ్యర్థుల ఎంపిక
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు లోక్ సత్తా పార్టీ సన్నద్ధం అవుతోంది. వార్డు స్థాయి సమస్యలను గుర్తించి, ప్రణాళికలను సిద్ధం చేసుకున్న లోక్ సత్తా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. నాయకత్వం, సమర్ధత, నిబద్ధత ఉండి, నగరాన్ని మార్చుకోవాలన్న ఆర్తి ఉన్న వారు లోక్ సత్తా తరఫున పోటీ చేసేందుకు ముందుకు రావాలని చేసిన విజ్ఞప్తికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. వందల సంఖ్యలో వచ్చి పడిన దరఖాస్తుల పరిశీలన మొదలైందని తొలి దశగా 70 డివిజన్ల పరిశీలన పూర్తయిందని లోక్ సత్తా అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, పి. భాస్కరరావు, యువసత్తా రాష్ట్ర కన్వీనర్ దాసరి రత్నం పేర్కొన్నారు. వార్డుల రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే అభ్యర్థులను ఖరారు చేస్తామని మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. యువత, విద్యావంతుల నుంచి తమ ఆహ్వానానికి అత్యధిక స్పందన లభించిందన్నారు.
కబ్జాదారుల నుంచి నగరాన్ని రక్షిద్దాం:
రాష్ట్ర రాజధానిలో నాయకత్వం అంటే భూమి కబ్జాలు, గూండాయిజమే అన్నట్లుగా మారిందని, భూములను ఆక్రమించుకునే వారు నాయకులుగా ఎదుగుతున్నారని లోక్ సత్తా ప్రతినిధులు అన్నారు. కోఠిలోని ఇఎన్ టి హాస్పిటల్ భూమిని థర్డ్ పార్టీ లిటిగేషన్ తో దర్జాగా కబ్జా చేసేందుకు ప్రముఖ నేతలిద్దరు ప్రయత్నించిన తాజా ఉదంతాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. బేగంపేట చికోటి గార్డెన్స పక్కన డ్రైనేజిగా ఉపయోగపడుతున్న స్థలాన్ని కబ్జా చేసేందుకు నేతలు రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ అక్రమార్జనతో, గూండాయిజంతో రాజకీయాలను శాసించడం ఓ సంస్కృతిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రక్షిత మంచినీరు, రవాణా, పారిశుధ్యం, సొంత ఇల్లు తదితర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకుని మహానగరాన్ని గర్పించదగ్గ స్థాయిలో మార్చుకునేందుకు ఈ ఎన్నికలు సువర్ణావకాశంగా ఉపయోగించుకోవాలని వారన్నారు. లోక్ సత్తా 'మిషన్ - 2014'కు గ్రేటర్ ఎన్నికల నుంచే శంఖారావు పూరించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధులు శ్రీనివాసరావు, భాస్కరరావు పిలుపునిచ్చారు.
News Posted: 30 June, 2009
|