కాంగ్రెస్ నాయకుడి హత్య
హైదరాబాద్ : అర్ధరాత్రి పూట మోటార్ సైకిల్ పై వెడుతున్న లంగర్ హౌస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ నాయుడిని ప్రత్యర్థులు దాడి చేసి దారుణంగా హతమార్చారు. బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ నాయడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బుధవారం ఉదయం శ్రీధర్ నాయుడికి స్థానికంగా ఉండే రమేష్ అనే వ్యక్తికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అయితే, లంగర్ హౌస్ పోలీసులు కలుగజేసుకొని రాజీ కుదిర్చి పంపించేశారు.
కాగా, రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత శ్రీధర్ నాయుడు మోటార్ సైకిల్ పై వెళుతుండగా రమేష్ కుమారుడు, అతని స్నేహితులు మూకుమ్మడిగా భవనం సెంట్రింగ్ కర్రలు, కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వెనువెంటనే వారు పరారయ్యారు. ఈ దాడిలో గాయపడిన శ్రీధర్ నాయుడిని స్థానికులు గోల్కొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. శ్రీధర్ నాయుడు హత్యకు పాత పగలు కూడా కారణం కావచ్చని తెలుస్తోంది.
News Posted: 2 July, 2009
|