హోంమంత్రి లేని భద్రతా సంఘం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేసిన భద్రతా సలహా సంఘంలో హోం మంత్రికి ప్రాతినిధ్యం లేకుండా చేయడాన్ని లోక్ సత్తా తప్పు పట్టింది. అసలు హోం మంత్రిని పక్కన పెట్టి భద్రతా సలహా సంఘాన్ని ఆర్భాటంగా ఏర్పాటు చేయడమే విచిత్రంగా ఉందని లోక్ సత్తా వ్యాఖ్యానించింది. పోలీసు యంత్రాంగానికి స్వయం ప్రతిపత్తి కల్పించి అందరికీ సమాన న్యాయం అందించే యత్నాలేవీ జరగడంలేదని లోక్ సత్తా అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, లక్ష్మణ్ బాలాజీ, రాజారెడ్డి విమర్శించారు. లోక్ సత్తా పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ప్రభుత్వ చర్యలపై నిప్పులు చెరిగారు.
భద్రతా సలహా సంఘాన్ని ఏ లక్ష్యాలతో ఏర్పాటు చేశారని లోక్ సత్తా ప్రతినిధులు ప్రభుత్వాన్ని నిలదీశారు. భద్రతా సలహా మండలి ప్రయోగం గురించి లోతుగా ఆలోచించారా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవని వారు అన్నారు. నిజాం ఫర్మానాల వలే అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్న వాతావరణమే ఈ ప్రభుత్వంలో తమకు కనిపిస్తోందని లోక్ సత్తా ప్రతినిధులు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా మభ్యపెట్టి మారేడుకాయ చేయాలన్న దృక్పథంతోనే వైఎస్ సర్కార్ వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు.
News Posted: 2 July, 2009
|